ఉప్పు తిప్పలు | - | Sakshi
Sakshi News home page

ఉప్పు తిప్పలు

Jul 4 2026 12:20 AM | Updated on Jul 4 2026 12:20 AM

ఏళ్లుగా సాగుకు నోచుకొని ఉప్పు గల్లీలు

ఉప్ప తయారీలో దేశంలోనే ఐదో స్థానం. ఉమ్మడి రాష్ట్రంలో రెండో స్థానం. మూడు వేల ఎకరాలకుపైగా ఉప్పు సాగు. నిత్యం వచ్చి పోయే వ్యాపారులు.. నిండుగా కొనుగోళ్లు.. ఒకప్పుడు నౌపడ వైభవమిది. కానీ ఇప్పుడు అక్కడ రైతులు వర్తకం చేయడానికి ‘ఉప్పు’తిప్పలు పడుతున్నారు. సాగు విస్తీర్ణం పడిపోవడం, సిండికేట్‌వ్యాపారం, ధర లేకపోవడంతో నౌపడ ఉప్పు పరిశ్రమ తన వైభవాన్ని కోల్పోయింది.

సంతబొమ్మాళి: నవ రుచులకు తల్లి.. నౌపడ ఉప్పుగల్లీ.. ఒకప్పుడు సిక్కోలు ముక్తకంఠంతో పలికిన మాట ఇది. ఒకప్పుడు ఉప్పు సాగులో దేశంలో ఐదో స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలం నౌపడతో పాటు భావనపాడు, మర్రిపాడు, యామలపేట, మూలపేట, కె.లింగూడు పంచాయతీల్లో సుమారు 1000 కుటుంబాలు ఉప్పు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా 3,200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టేవారు. ప్రతి సీజన్‌లో 5 లక్షల నుంచి ఏడు లక్షల వరకు ( 50కేజీలు) బస్తాలను పండించేవారు. ఇదంత గతం. ఇప్పుడు ఉప్పు సాగు ప్రతి సీజన్‌ (డిసెంబర్‌ నుంచి మే నెల వరకు)లో తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సుమారు 400 ఎకరాల్లో మాత్రమే ఉప్పు సాగు జరుగుతోంది. సుమారు లక్ష బస్తాలు మాత్రమే పండించగలుగుతున్నారు.

కారణాలు అనేకం

ప్రతి సీజన్‌లో ఉప్పు సాగు విస్తీర్ణం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. పండించిన ఉప్పు పంటకు ధర లేకపోవడం ప్రధాన కారణం. కూలి రేట్లు, డీజల్‌ రేట్లు పెరిగినా ఉప్పు బస్తా ధర మాత్రం పెరగలేదు. 50 కిలోల ఉప్పు బస్తా ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. దీనికి తోడు ఉప్పు పండించే సీజన్‌లో అకాల వర్షాలు పడటం వల్ల రైతులకు అదనపు పెట్టుబడి భారమవుతోంది. మరో వైపు వ్యాపారులు సిండికేట్‌ కావడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. మార్కెట్లో ఉన్న ధరతో సంబంధం లేకుండా సిండికేట్‌ వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు పండించిన ఉప్పును అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2018 సంవత్సరం నుంచి లైసెన్స్‌లు కేంద్ర ప్రభుత్వం రెన్యువల్‌ చేయకపోవడం, మూలపేట పోర్టుకు కొంత భూమి ఇవ్వడం వంటి కారణాలతో సాగు తగ్గింది. భవిష్యత్‌లో ఉప్పుసాగు ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు అంటున్నారు.

రోజురోజుకూ తగ్గుతున్న నౌపడ ఉప్పు పరిశ్రమ విస్తీర్ణం

గతంలో మూడువేల ఎకరాల్లో సాగు

ప్రస్తుతం 400 ఎకరాలకు పడిపోయిన వైనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement