శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు పెడుతున్నారు. పైకమిస్తేనే పనిచేస్తున్నారు. లేదంటే ఫైల్ రిజెక్టే. ఆర్టీఓ ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. దీని వల్ల కొద్ది రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల బదిలీపై వచ్చి ఓ మహిళా అధికారి వచ్చిన ఫైల్స్‌ను సైతం ఎలాంటి లోపాలు లేకపోయినా రిజెక్ట్ చేస్తుండడంతో వాహనదారులంతా ఆందోళన చెందుతున్నారు. కారణాలు ఏంటని ప్రశ్నిస్తే మాత్రం ఆమెను నేరుగా కలిస్తేనే సదరు ఫైల్ ఓకే అవుతోంది. మరికొన్ని జటిలమైన పనులకు సైతం ఆమెకు అత్యంత సన్నిహితం గల ఇద్దరు ఏజెంట్లను కలవాల్సిందే. అక్కడ వారు అడిగిన పైకాన్ని అందిస్తే చాలు సా యంత్రానికి కల్లా ఫైల్ చేతిలో ఉంటుంది.
ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి వైట్‌బోర్డుకు సంబంధించిన నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అప్రూవుల్ చేయడానికి వెళ్లగా ఆయన వద్ద నుంచి రూ.600 అదనంగా వసూలు చేసినట్లు తెలిసింది. నరసన్నపేటకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు వెళ్లినా రూ.500 ఏజెంట్ చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఎల్‌ఎల్‌ఆర్ అప్రూ వుల్ చేయడానికి ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే నేరుగా అప్రూవుల్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసినపుడు ఆర్టీఓను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆ మహిళా అధికారి మాత్రం కావాలనే కొర్రీలు వేస్తూ ఫైల్‌ను రిజెక్ట్ చేస్తోంది. ఏజెంట్లన కలిసి డబ్బులిస్తేనే పని జరుగుతోంది. వాహనానికి సంబంధించిన ఆధార్ సీడింగ్ చాలా అవసరం. ఈకేవైసీ అప్రూవుల్ కుడా ఉచితంగా చేయాలి. కానీ వాటికి కూడా అదనంగా మరో రూ.300 చెల్ల్లించుకుంటే ఓకే అవుతోంది. ఇన్ని డబ్బులు కట్టినా చివరికి ఆమెకు సంబంధించిన ఏజెంట్లకు కుడా అదనంగా మరికొంత పైకం ఇచ్చుకోవాల్సిందేనని లోకల్ టాక్.
విచారణ చేయిస్తా
ఆర్టీఓ కార్యాలయంలో నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సంబంధించి జరుగుతున్న అక్రమ వసూళ్లపై విచారణ చేయిస్తాం. ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటాం.
– విజయసారథి, జిల్లా ఉపరవాణా శాఖాధికారి
ఆర్టీఓ కార్యాలయంలో వసూళ్ల దందా
ప్రతి పనికీ ఓ రేటు
చూసీచూడనట్టు వదిలేస్తున్న ఉన్నతాధికారులు


