కవిటి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేసిన విత్తనాలు నారుమడి స్థాయిలోనే మొలకశాతం తగ్గి నష్టపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ నర్తు రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ ఆర్‌జీఎల్ వరి విత్తనాలను కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో రైతులకు అందించిందని, నేటికి 15 రోజులైనా మొలకలు రాలేదన్నారు. బొరివంక, డీజీ పుట్టుగ, కపాసుకుద్ధి, పుటియాదల, డొంకూరు, ఈదుపురం, ధర్మపురం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల తరఫున ఉద్యమం తప్పదన్నారు.
జిల్లా మోడరన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపికలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మోడరన్ పెంటాథ్లెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మోడరన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రధాన కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాజాంలోని జీసీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాస్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్–15, 17, 19, యూత్, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలను ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరు వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డులను విధిగా తీసుకురావాలని, వివరాలకు 91772 27837 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
వేధింపులపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్న వ్యక్తి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాకుళం రూరల్ మండలం రాయిపాడుకు చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీకి శుక్రవారం వినతి పత్రం అందించారు. యాళ్ల చంద్రశేఖర్ అలియాస్ యాళ్ల శ్రీను అనే వ్యక్తి గతంలో కూడా వేధించడంతో శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, కొన్ని కారణాల వల్ల విత్‌డ్రా చేసుకున్నామని చెప్పారు. వేధింపులు భరించలేక పిల్లలను విశాఖ హాస్టల్‌లో చదిస్తున్నామని, సెలవులకు వచ్చినప్పు డు మరలా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘టెక్కలి సీఐ వేధిస్తున్నారు’
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టెక్కలి సీఐ విజయ్‌కుమార్ తనను వేధిస్తున్నారని, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, స్టేషన్‌కు వస్తున్న కేసుల్లో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొమ్ము తరుణ్ అనే టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ఇప్పుడీ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పేరు చెప్పి ఓ మహిళ వద్ద రూ.40 లక్షలు తీసుకున్నానని తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ కేసులో అసలు ఫిర్యాదు లేకుండా తనను అరెస్టు చేశారని పేర్కొన్నాడు. తాను టీడీపీ కార్యకర్తగా ఉన్నప్పటికీ అన్యాయంగా చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపించారని, మంత్రి అచ్చెన్నాయుడుకు బంధువునని చెప్పుకుంటూ సీఐ విజయ్‌కుమార్ అక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు. ఈ వీడియో అటు పోలీసు వర్గాల్లో మరో వైపు జిల్లా వ్యాప్తంగా విభిన్న వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే వీడియో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సీఐ వ్యవహార శైలిపై గతంలో జిల్లా ఉన్నతాధికారులు పలు సమీక్షల్లో హెచ్చరించినట్లు సమాచారం.
అరుణోదయ నాగన్న మృతికి సంతాపం
పలాస: అరుణోదయం నాగన్నగా గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన పరకాల నాగన్న శుక్రవారం తన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందడంతో ఉద్దానం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరై, చివరి వరకు ఆ సంఘాన్ని నడిపించి తన ఆట పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన నాగన్నకు ఉద్దానం ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం సద్దుమణిగిన తర్వాత పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో 1978 నుంచి ఉద్దానం ప్రాంతంలో ఆయన పర్యటించారు. వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు వద్ద నిర్మించిన జిల్లా అమరవీరుల స్మారక స్థూపం వద్ద బుర్రకథ దళం బృందంకళాకారులు అరుణోదయ రామారావు, కానూరి వెంకటేశ్వరరావులతో కలసి కళా ప్రదర్శనలు ఇచ్చారు. చివరిగా 2023లో పలాస సూదికొండ కాలనీలో విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి సభకు హాజరై నివాళ్లు అర్పించా రు. నాగన్న మృతిపట్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రామారావు, సోమేశ్వరరావు, ఉద్దానం రచయతల సంఘం అధ్యక్షుడు కుత్తుం వినోద్, నిశితాసి, పోతనపల్లి కుసుమ, కొర్రాయి నీలకంఠం తదితరులు సంతాపం తెలియజేశారు.
పలాస సూదికొండ కాలనీలో సుబ్బారావు పాణిగ్రాహి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాగన్న(ఫైల్)


