● పనస పండ్ల అమ్మకాల జోరు
● మార్కెట్‌లో పెరిగిన గిరాకీ
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంత రైతుల ప్రధాన జీవనాధారమైన పంటల్లో ఒకటైన పనస పంటకు మార్కెట్‌లో భలే గిరాకీ ఉంది. పనస కాయ, పండ్లలో విలువైన పోషకాలు మెండుగా ఉండడంతో పాటు రుచి కూడా బాగుంటుంది. దీంతో భోజనప్రియులు వీటిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. పనస కాయలను విందు భోజనాల్లో అధికంగా వినియోగిస్తారు. దీంతో ఈ పంట ప్రారంభంలోనే కాయలను జోరుగా అమ్మకాలు చేస్తూ.. కలకత్తా, బెంగుళూరు, ఒడిశా, భువనేశ్వర్, హైదరాబాద్ ఇతర సుదూర ప్రాంతాలకు తరలించి రైతులు ఆదాయాన్ని పొందారు. ప్రస్తుతం పనస పండ్లు అమ్మకాలు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. వేసవి కాలం ముగింపు దశలో పసన పండ్లుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ పెరిగింది. ఏడాదిలో ఒకేసారి లభించే ఈ పనస పండ్లు తియ్యటి రుచితో పాటు పోషక విలువలు అధికంగా ఉండడంతో ప్రజలు పనస పండ్లును తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉద్దాన ప్రాంతంలో పండిన ఈ పండ్లను జాతీయ రహదారుల వెంట విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు.
పరిమాణం ఆధారంగా ధరలు
ఒక్కొక్క పండును వాటి పరిమాణంతో పాటు ఖజ్జా, బురద రకాల బట్టి రూ.100ల నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. పండ్లతో పాటు పసన తొనలను కూడా ప్రత్యేకంగా అమ్మకాలు చేస్తూ జీవనోపాఽధిని పొందుతున్నారు. కాగా సీజన్‌లో ప్రత్యేకంగా దొరికే ఈ పనస పండ్లును తినేందుకు ప్రజలు మక్కువ చూపడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. దీంతో పండ్లు అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రైతులతో పాటు వ్యాపారులకు కూడా ఆదాయం కలిసి వస్తోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో పనస పండ్లు బాగా మగ్గి తొనలు రుచిగా ఉంటాయని, వర్షాలు కురిస్తే మాత్రం ఈ పండ్లు రుచిని కోల్పోవడంతో పాటు పండ్లు లోపల ఉన్న పిక్కలు మొలకలు వచ్చే పరిస్థితి ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం పనస పండ్లు తినేందుకు ప్రజలు మార్కెట్‌ల వైపు ఎగబడుతూ ఈ సీజనల్ ఫ్రూట్ రుచిని అస్వాదిస్తున్నారు.
నోరూరిస్తున్న పనస తొనలు


