● మే, జూన్ నెలల్లో సహకరించని వరుణుడు
● జూలైపైనే అన్నదాతల ఆశలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మే, జూన్ నెలల్లో వరుణుడు ముఖం చాటేయడంతో జూలై నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువులు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇలాగైతే కష్టమే..
మే, జూన్ నెల వర్షాలను ఒకసారి పరిశీలిస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మే నెలలో 100.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 67.8 మి.మీ.లకే పరిమితమైంది. 21 మండలాల్లో సగటు కంటే చాలా తక్కువ వర్షం కురిసింది. మరో మూడు మండలాల్లో చిరుజల్లులతోనే సరిపెట్టింది. సోంపేటలో మాత్రమే సగటు వర్షం కురిసింది. ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా సగటుకంటే 32.5 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయి. జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 30 మండలాల్లో జూన్‌లో 134.9 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 84.4 మి.మీ.ల వర్షం పడింది. ఈ నెలలో కూడా 37.4 శాతం వర్షపాతం తక్కువ నమోదయ్యింది. 8 మండలాల్లో సగటు కంటే తక్కువ వర్షం పడింది. అంటే ఈ నెలలో పూర్తిగా (డెఫిసిటీ) తక్కువ వర్షం పడినట్టు లెక్క. 7 మండలాల్లో చిరు జల్లులతోనే సరిపెట్టింది. సగటు వర్షపాతం కేలం 4 మండలాల్లోనే పడింది.
ఇదీ పరిస్థితి..
ఏటా ఖరీఫ్ సీజన్‌లో జిల్లా రైతులు 30 మండలాల్లో సుమారు 1,53,060 హెక్టార్లలో వరి పంట వేస్తున్నారు. ఒకప్పుడు 2.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగయ్యేది. జిల్లా విభజన తర్వాత వరి పంట విస్టీర్ణం తగ్గింది. ఈ ఏడాది జిల్లాలో 1,53,060 హెక్టార్లలో వరి పంట వేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. జూలైలో ఎక్కువగా వెదలు జల్లుతారు. మరికొంత విస్తీర్ణంలో వరి నాటుకునేందుకు నారు మడులు సిద్ధం చేస్తుంటారు. సకాలంలో వర్షాలు లేక చాలాచోట దుక్కిలు సరిగా జరగలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది మే నెలలో వర్షాలు విపరీతంగా కురిశాయి. జూన్‌లో పంటలు వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేఘాలు కమ్ముకుంటున్నా వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా లేదు.
– కూన రామారావు, రైతు


