సంతబొమ్మాళి: మరువాడ పంచాయతీ ఆర్.మరువాడ గ్రామానికి చెందిన పాల ఈశ్వరరావు దుబాయ్‌లో అదృశ్యమై కొన్ని రోజుల తర్వాత ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈశ్వరరావు మే 15న హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు జీవనోపాధి కోసం స్థానిక ఏజెంట్ ద్వారా వెళ్లారు. 16న మెడికల్ నిమిత్తం వెళ్లిన సమయంలో అక్కడ తప్పిపోయారు. భాష రాకపోవడంతో దుబాయ్ పోలీసులు అనుమానించి జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఫోన్ చేయకపోవడంతో ఈ విషయం తెలియక ఈశ్వరరావు భార్య భారతి, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత స్నేహితులు గంట గోవిందరావు, పైల కేశవరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పడంతో దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ నెల 2న విడిపించారు.
శతాధిక వృద్ధురాలు మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: చినవంక గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సాన అప్పలమ్మ(102) శుక్రవారం మృతి చెందారు. ఈమె మంకినమ్మ దాసురాలుగా ఉద్దాన ప్రాంత భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించారు. అప్పలమ్మ భర్త, కుమార్తె కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో మనవడు ధనరాజ్ అంత్యక్రియలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
రణస్థలం: పైడిభీమవరం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఊక లారీ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదంలో ఊకలో ఉన్న కార్మికుడు వీరబాబుకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలానికి చెందినవాడిగా గుర్తించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


