శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 4, 5 తేదీలలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని నమోదు పత్రాలు సమర్పించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని 279 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి నమోదు పత్రాలు స్వీకరించడం, వాటి ధ్రువీకరణ, డిజిటలీకరణ ప్రక్రియకు సంబంధించిన సేవలు అందిస్తారని చెప్పారు. ప్రతి ఓటరూ నమోదు పత్రాన్ని పూర్తిగా నింపి అవసరమైన ధ్రువీకరణ పత్రాల ప్రతులను బూత్ స్థాయి అధికారికి సమర్పించాలని సూచించారు. ఇంకా నమోదు పత్రం సమర్పించని వారు ప్రత్యేక శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు.


