అయ్యగారి అక్రమాల రింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అయ్యగారి అక్రమాల రింగ్‌

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

కార్యదర్శి ఇంట్లో

పంచాయతీ రికార్డులు

కార్యదర్శి కవరింగ్‌

ఫొటో చూడండి. జేఆర్‌పురంలోని గ్రామ కార్యదర్శి తన ఇంటిలో పైడి భీమవరం పంచాయతీ రికార్డులను దగ్గర పెట్టుకుని చూస్తున్నారు. ఈయనేదో పంచాయతీ అభివృద్ధి కోసమో.. నిధులు వినియోగంపై సక్రమ రికార్డుల నిర్వహణ కోసమో నిమగ్నమయ్యారనుకుంటే పొరపాటే. పంచాయతీ నిధులు దుర్వినియోగం అభియోగాలతో సీజ్‌ చేసిన రికార్డులను పరిశీలిస్తున్న వైనమిది. అధికారుల దగ్గర ఉండాల్సిన రికార్డులు సంబంఽధిత గ్రామ కార్యదర్శి ఇంటిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వెళ్లకూడదో, వారికే సీజ్‌ చేసిన రికార్డులు వెళ్లాయి. ఇక, వాటిలో ఏం జరుగుతాయో అందరికీ తెలిసిందే.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

మేజర్‌ పంచాయతీ పైడి భీమవరంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. విచారణ పక్కదారి పట్టించేందుకు వ్యూహరచన చేశారు. దానిలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. నిధులు దుర్వినియోగం కథ కంచికి చేర్చేందుకు పక్కా ప్లాన్‌ చేశారు. విచారణ జరపాల్సిన డీఎల్‌పీఓను తప్పించి ఎంపీడీఓకు బాధ్యతలు అప్పగించారని కూడా తెలిసింది. సీజ్‌ చేసిన పంచాయతీ రికార్డులు అధికారులు దగ్గర ఉండాల్సిందిపోయి పంచాయతీ కార్యదర్శి ఇంటికి పంపించారు. ఇప్పుడా రికార్డులు సరిదిద్దే పనిలో పంచాయతీ కార్యదర్శి నిమగ్నమయ్యారు. దానికి సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. ఇదేమి నిర్వాకమంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలోని మేజర్‌ పంచాయతీ పైడి భీమవరంలో టీడీపీ నేత భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఎస్సీ మహిళ సర్పంచ్‌గా కొనసాగిన పంచాయతీలో రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీకి చెందిన రౌతు శ్రీనివాసరావు వైపు వేళ్లన్నీ చూపిస్తున్నాయి. సర్పంచ్‌ ప్రతినిధి హోదాలో నిధులు మింగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు సైతం వెళ్లాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే నిధులు గోల్‌మాల్‌ జరిగాయి. దీనిపై జూన్‌ 21వ తేదీన జరిపిన విచారణలో అక్రమాలు బయటపడ్డాయి. ఒక్క ఏడాదిలో రూ.9.43కోట్ల నిధులను వివిధ పనులు, అడ్వాన్సుల రూపేణా ఊదేశారు. సుమారు రూ.3కోట్లు పైచిలుకు నిధులు ఎలాంటి పత్రం లేకుండా అడ్వాన్స్‌ రూపంలో ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతినిధి, టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు మింగేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు సైతం ఉన్నాయి. పంచాయతీ ఆధికారుల అండతో పంచాయతీ తీర్మానం లేకపోయినా 2025లో ఒకే ఏడాది రూ.9.43 కోట్లు పైచిలుకు నిధులు అడ్డగోలు లెక్కలు చూపించి విత్‌డ్రా చేశారు. ప్రధానంగా సీసీ రోడ్లు, కాలువలు, కుళాయిలు, విద్యుత్‌ సామాన్లు, డ్రైనైజీ పెపులు రూపంలో అధిక ఖర్చులు చూపించి వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పంచాయతీరాజ్‌ చట్ట ప్రకారం రూ. 5లక్షలు దాటి నిధులు డ్రా చేయాలంటే మండల ఉన్నతాధికారులు సంతకాలు కావాలి. ప్రధాన కాంట్రాక్టర్‌కై నా నిధులు ఒకేసారి వేయడానికి లేదు. అలాంటిది ఎలాంటి అర్హత లేని ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతినిధి పేరుతో టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు అకౌంట్‌లో నేరుగా రెండు నెలల వ్యవధిలో అడ్వాన్స్‌ రూపంలో రూ.2.52 కోట్లు నిధులు జమ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

డీఎల్‌పీఓను మార్చి.. ఎంపీడీఓను పెట్టారా?

పంచాయతీ నిధులు అవకతవకలు, అక్రమాలపై ప్రధానంగా విచారణ చేయాల్సింది డీఎల్‌పీఓనే. పంచాయతీ నిధులు వినియోగంపై వారికే పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీఎల్‌పీఓను విచారణ అధికారిగా తొలుత నియమించారు. కానీ టీడీపీ నేత బాగోతం ఎక్కడ బయటపడుతుందోననే కుట్రలకు తెర లేపారు. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కోట్లు వ్యవహారం బయటపడితే పరువు పోవడమే కాకుండా పార్టీపై మచ్చ పడుతుందని అక్రమార్కులు సదరు ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. వీరిలో ఒకరికి ముడుపులు అందించారని ఆరోపణలు ఉండగా, మరొకరికి భూలావాదేవీలకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. మొత్తానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ఉన్నతాధికారులపై ఒత్తిడికి తీసుకొచ్చారు. ఏకంగా విచారణ అధికారినే తొలగించి, వారి స్థానంలో స్థానికంగా ఉన్న ఎంపీడీఓను నియమించినట్టు సమాచారం. దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి.

నిధులు అవతకవకలను గుర్తించాక పంచాయతీ రికార్డులను అధికారులు సీజ్‌ చేశారు. ఇదే విషయాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్‌ ధ్రువీకరిస్తూ ప్రకటన కూడా చేశారు. పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. అవన్నీ అధికారుల వద్ద భద్రంగా ఉండాలి. కానీ, అందుకు భిన్నంగా సీజ్‌ చేసిన రికార్డులు ఆ గ్రామ కార్యదర్శి చేతికి అందాయి. జీఆర్‌పురంలోని ఆయన ఇంటికొచ్చాయి. తన ఇంట్లో సదరు రికార్డులను కార్యదర్శి సరిదిద్దే పనిలో పడ్డారు. దానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చేశాయి. సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. రికార్డుల మార్ఫింగ్‌ జరుగుతుందన్న వాదనలకు ఆ ఫొటోలు బలం చేకూర్చాయి. దీని వెనుక ఉన్నదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పైడి భీమవరంలో పంచాయతీ నిధుల

దుర్వినియోగం

ఆ వ్యవహారాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం

ఓ ఇద్దరు ఎమ్మెల్యేల లాబీయింగ్‌

విచారణాధికారుల దగ్గర ఉండాల్సిన రికార్డులు పంచాయతీ కార్యదర్శి ఇంటికి

ఆ రికార్డులను మార్చే పనిలో పంచాయతీ కార్యదర్శి

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement