నిరంకుశత్వంపై.. నిరసన జ్వాల | - | Sakshi
Sakshi News home page

నిరంకుశత్వంపై.. నిరసన జ్వాల

Jul 3 2026 1:22 AM | Updated on Jul 3 2026 1:22 AM

ఇసుక అక్రమ రవాణాపై బుచ్చిపేట గ్రామస్తుల ఆగ్రహం

శ్మశానం కూడా మిగలకుండా తవ్వేస్తున్నారని మండిపాటు

నరసన్నపేట

వంశధార నదిలో బుచ్చిపేట నుంచి చేనువలస వరకూ ఇసుకాసురులు విధ్వంసం సృష్టిస్తున్నారు. మొత్తం నది స్వరూపమే మారిపోయేలా ఇష్టానుసారం ఇసుక దోచుకుంటున్నారు. ప్రస్తు తం నదిలో పొడి ఇసుక అన్నదే లేదు. అంతా తడి ఇసుకే అందిన మేరకు లోతుకు వెళ్లి తవ్వేస్తున్నా రు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులంతా గురువారం ఇసుక ర్యాంపు నిర్వాహకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నుంచి వస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో గురువారం మధ్యాహ్నం వరకూ బుచ్చిపేట ఇసుక ర్యాంపు మార్గంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఇసుక లారీల సిబ్బంది వాదనకు దిగారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు వచ్చే వరకూ.. సమస్యలు పరిష్కరించే వరకూ లారీలను విడిచి పెట్టబోమని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక లారీల సిబ్బంది ఇసుక ర్యాంపు నిర్వహకులకు సమాచారం ఇచ్చారు.

రోడ్డు ఛిద్రం చేస్తున్నారు..

ఈ సందర్భంగా గ్రామస్తులు జాయి శ్రీను, కొన్న శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఇసుక ర్యాంపు నిర్వహకుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘లారీల రాకపోకలతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. ఏటికి వెళ్లే రోడ్లు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇదే మార్గంలో శ్మశానం ఉంది. శవాన్ని తీసుకువెళ్లేదుకు కూడా అవస్థలు పడుతున్నాం. అలాగే నదిలో ఇష్టానుసారంగా గోతులు పెట్టి అందిన మేరకు ఇసుక తవ్వేస్తున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. సమీప పొలాలు, జీడి తోటలు నీరు లేక ఎండిపోతున్నాయి. ఉదయం పూట స్కూల్‌ బస్సు లు వచ్చే సమయంలో లారీలతో ఇబ్బంది అవుతోంది. స్కూ ల్‌ పిల్లల సైకిళ్లు బురదలో కూరుకుపోతున్నాయి’ అంటూ తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఏకరువు పెట్టారు. అనంతరం ఇసుక ర్యాంపు నిర్వహకులు వచ్చి గ్రామస్తులతో సంప్రదింపులు చేసి రోడ్డును అభివృద్ధి చేస్తామని, ఇసుక లారీలతో పిల్లలకు, గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement