ఆమదాలవలస: పట్టణంలోని పలు ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (రూరల్) బి.రజిని గురువారం తనిఖీ చేశారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, పంపిణీ విధానాన్ని పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులకు విక్రయించే ప్రతి ఎరువుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, నిబంధనలను ఉల్లంఘించిన డీలర్లపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి నవీన్, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.


