ఆర్‌డీఎస్‌ఎస్ పనులు జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు నగరంలో వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతానికి 33 కేవీ యూజీ కేబుల్ పనులు జరుగుతుండగా.. 11 కేవీ యూజీ కేబుల్ పనుల కోసం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆమోదం కోసం ఫైల్ పంపించాం. జనాలకు ఇబ్బందులు లేకుండా రాత్రి వేళల్లో పనులు పూర్తి చేసేలా కన్‌స్ట్రక్షన్స్ విభాగ అధికారులకు సూచించాం. విపత్తుల నుంచి జిల్లాలో తీర ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లకుండా కవర్డ్ కండక్టర్ల కేబుల్స్ పనులు కూడా ప్రాసెస్‌లో ఉన్నాయి.
– జీఎన్ ప్రసాద్, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
అరసవల్లి: జిల్లా కేంద్రంలో భూగర్భ విద్యుత్ కేబు ల్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్) కింద రూ.459.18 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించి, ఆయా పనులకు పరిపాలనా అనుమతులతో టెండర్లు ఖరారైపోయాయి. ఈ ఆర్‌డీఎస్‌ఎస్ స్కీమ్ కింద జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన పనులకై 2021లోనే అప్పటి ఎస్‌ఈ మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సర్వే చేపట్టారు. నాటి ఈ ప్రతిపాదిత పనులకు ఇప్పటికి గ్రహణం వీడి పునఃప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు ప్రాజెక్టును ఎస్‌ఈ జీఎన్ ప్రసాద్, కన్‌స్ట్రక్షన్స్ ఈఈ ఆనంద్ పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు తీర ప్రాంత సబ్‌స్టేషన్ల వద్ద కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు పనులకు కూడా మార్గం సుగమమైంది.
అమలు ఇలా..
ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో భాగంగానే 2022లోనే తొలిసారిగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయం ముందు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు పూర్తి చేసిన విద్యుత్ శాఖాధికారులు.. తాజాగా నగరంలోని మిగిలిన కీలక ప్రాంతాల్లో ఈ భూగర్భ వ్యవస్థ అమలుకు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు ఆదిత్య (అరసవల్లి) 11 కేవీ ఫీడర్, పీఎన్ కాలనీ, శాంతినగర్ కాలనీ, విశాఖ–ఎ కాలనీ, బలగ, సరస్వతి మహాల్, ఆదివారం పేట 11 కేవీ ఫీడర్లకు మొత్తం 23.5 కిలోమీటర్లు మేర అండర్‌గ్రౌండ్ (యుజి) కేబుల్స్‌ను రూ.7.65 కోట్లతో వేయనున్నారు. అలాగే అంపోలు నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు, చిలకపాలెం నుంచి గుజరాతీపేట వరకు, అలాగే గుజరాతీపేట నుంచి శ్రీకాకుళం ఆవుట్‌డోర్ సబ్‌స్టేషన్ వరకు, అలాగే అరసవల్లి సబ్‌స్టేషన్ నుంచి ఇండోర్ సబ్‌స్టేషన్ వరకు, శ్రీకాకుళం అవుట్ డోర్ సబ్‌స్టేషన్ నుంచి ఎఎస్‌ఎన్ కాలనీ సబ్‌స్టేషన్ వరకు మొత్తం 25 కిలోమీటర్ల 33 కేవీ ఫీడర్లకు యూజీ కేబుల్స్‌ను రూ.15.23 కోట్లతో వేయనున్నారు. అలాగే అరసవల్లి సబ్‌స్టేషన్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు, 33 కేవీ బొరివంక సబ్‌స్టేషన్ నుంచి మాణిక్యపురం వరకు, అలాగే బొరివంక నుంచి దూగానపుట్టుగ వరకు, అలాగే 33 కెవి రాజపురం సబ్‌స్టేషన్ నుంచి కవిటి వ్యవసాయ ప్రాంతాల వరకు మొత్తం 254 కిలోమీటర్లు మేర 789 స్పన్ పోల్స్ మీదుగా కవర్డ్ కండక్టర్ కేబుల్స్ వేసేందుకు రూ.26.42 కోట్లు వెచ్చించనున్నారు.
శ్రీకాకుళం నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు జరుగుతున్న దృశ్యం
రూ.45.46 కోట్ల అండర్ గ్రౌండ్ కేబుళ్లు, కవర్డ్ కండక్టర్ పనులు
2021లో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు, సర్వే పూర్తి
ఎట్టకేలకు ఆ పనుల కొనసాగింపునకు మోక్షం


