రణస్థలం: పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అందుకు శాంతిభద్రతల ప్రాధాన్యత అవసరమని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన సిస్కో (శ్రీకాకుళం ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్) పోలీస్ స్టేషన్‌ను ఆయన గురువారం పునఃప్రారంబించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ నిధులు రూ. 20లక్షలు వెచ్చించి మళ్లీ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో నియంత్రణ, అత్యవసర సంఘటనలపై తక్షణ స్పందన ఉంటుందని చెప్పారు. అనంతరం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ఏడాదిగా డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమ సౌజన్యంతో సిస్కో పైడిబీమవరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో మాదిరిగా ప్రారంభించి వదిలేయకుండా ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఉండాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.నారయణరెడ్డి, అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐ ఎం. అవతారం, ఎస్సై చిరంజీవి, సిస్కొ పరిధిలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఉన్నారు.


