తరుగుతో బస్తాలు..
● జె.ఆర్.పురం 66వ డిపోకు వచ్చిన బస్తాల్లో భారీగా తరుగు
● 50 బస్తాల్లో 9 బస్తాల్లో తక్కువగా బియ్యం
● డీఏం అదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన
రణస్థలం: ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత లోపించింది. తరుగుతో ఉన్న బియ్యం బస్తాలను అంటగడుతున్నారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా లావేరులో కొన్ని నెలలుగా పౌరసరఫరాల గోదాం నుంచి తరుగుతో కూడిన బియ్యం బస్తాలు వస్తున్నాయంటూ డీలర్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని బుధవారం నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండలం జె.ఆర్.పురం పంచాయతీలో 66వ రేషన్ డిపోను చిన్ని పావని పేరుతో చిన్ని రవి అనే దివ్యాంగుడు నిర్వహిస్తున్నారు. జూలై నెల రేషన్ ఇచ్చేందుకు 296 రేషన్ కార్డుదారులకు గాను 50 కేజీల బరువుతో ఉన్న 88 బస్తాలు విడిపించారు. ఆ బస్తాల్లోని సుమారు 9 బస్తాల్లో తరుగు భారీగా ఉండటం గుర్తించారు. ఒక బస్తాలో 41.620 కేజీలు, మరొక బస్తాలో 41.890 కేజీలు, 43.460 కేజీలు, 45.420 కేజీలు చొప్పున వ్యత్యాసం ఉండటాన్ని హమాలీల సమక్షంలోనే డీలర్ గుర్తించారు. ఈ విషయమై లావేరు గోదాం డీటీ నానిబాబుకు ఫిర్యాదు చేయగా ఆయన పట్టించుకోలేదు. తిరిగి ఒక బస్తా మాత్రమే ఇస్తానని, తీసుకుంటే తీసుకో లేదంటే పో అంటూ సమాధానమిచ్చారని డీలర్ రవి వాపోయారు. తరుగు ఎక్కువగా ఉండటంపై డీటీ వద్ద వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోనికి రాలేదు. దీంతో సివిల్ డిప్యూటీ తహసీల్దార్ అరుణకుమారి, సివిల్ సప్లయ్ డీఏం టి.వేణుగోపాలరావుకు విషయం తెలియజేయగా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉన్నతాధికారులు ఆదేశాలతో..
ఉన్నతాధికారుల ఆదేశాలతో డీటీ నానిబాబు వెంటనే 66వ రేషన్ డిపో వద్దకు వెళ్లి పరిశీలించారు. తరుగుతో సుమారు 9 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. 41 కేజీల నుంచి 48 కేజీలతో బస్తాలు ఉన్నట్లు నిర్ధారించారు. అన్ని బస్తాల్లోని తరుగు లెక్కకట్టగా సుమారు నాలుగు బస్తాలు రేషన్ డీలర్‌కు ఇవ్వాల్సి ఉందని గుర్తించి, రేపటి కల్లా అందజేస్తామని చెప్పారు.


