విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సారవకోట, టెక్కలి మండలాలకు చెందిన ఆరుగురు బాధితుల నుంచి లక్షలు రూపాయలు దండుకుని మోసం చేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం వడ్డినవలస గ్రామానికి చెందిన పాలిన చిన్నారావుకు రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మొయిన్ నమ్మబలికాడు. చిన్నారావు తనకు తెలిసిన టెక్కలి మండలం కొండ భీంపురం గ్రామానికి చెందిన మరో నలుగురు, గొదలాంకు చెందిన మరో యువకుడితో కలిసి గత ఏడాది సెప్టెంబర్‌లో సికింద్రాబాద్‌లోని ఒక లాడ్జిలో మొయిన్‌ను కలిశారు. వీరందరికి రష్యాలో ఉద్యోగాలున్నాయని నమ్మబలికాడు. అందుకు పాలిన చిన్నారావు రూ.లక్ష, బుడ్డ కోటేశ్వరరావు, ఇప్పిలి లక్ష్మినారాయణ, ఇప్పిలి గోవిందరావు, కోరాడ వెంకటేష్, కొర్రాయి ప్రసాదరావులు రూ.1.72 లక్షలు చొప్పున మొయిన్‌కు విడతల వారీగా 7816036131 నంబర్‌కు ఫోన్ పే చేశారు. డబ్బులు చేతికొచ్చిన తర్వాత మొయిన్ ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. ఈ విషయమై ఈ ఏడాది మార్చి 24న సారవకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు చేయకపోవడంతో బాధితులు మరోసారి బుధవారం పోలీసుస్టేషన్‌కు వచ్చి ఆరా తీశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ విదేశాలలో ఉద్యోగం వస్తుందని అప్పు చేసి డబ్బులు ముట్టజెప్పామని, తీరా తమను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.


