శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరంలో 50 డివిజన్లలో మంచినీటి కుళాయి పైపులైన్లు వేసి దశాబ్దాలు గడుస్తోంది. దాదాపుగా పైపులైన్లన్నీ కాలువల్లోనే దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పైపులు తుప్పుపట్టి ముక్కలయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి కొత్త రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో ఇరువైపులా ఉన్న కాలనీల్లో పైపులైన్లు దెబ్బతిన్నాయి. బలగ, దమ్మలవీధి, కాకివీధి, కంపోస్టు కాలనీ, హయాతినగర్, భైరివానిపేట, యాతపేట, గుజరాతిపేట, రెల్లవీధి, వైష్ణపువీధి, కృష్ణాపార్కు, గుడివీధి, జెండాలవారివీధి, మంగువారితోట, గూణపాలెం, ఏఎస్‌ఎన్‌కాలనీ, అరసవల్లిలో కాలువల్లో పైపు లైన్లు పూర్తిగా మునిగిపోయి వాటి మీదుగా కాలువనీరు ప్రవహిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో బలగ ప్రాంతంలో డయేరియా ప్రబలి ఇద్దరు, ఈ ఏడాది ఫిబ్రవరిలో దమ్మలవీధి ప్రాంతంలో డయేరియా ప్రబలి సుమారు 10 మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో కొన్ని పైపులైన్లు మార్చేసి తర్వాత పట్టించుకోవడం మానేశారు.


