పండగ వేళ పందేలు వద్దు
శ్రీకాకుళం క్రైమ్ : రానున్న సంక్రాంతి పండగను జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని, పేకాట, కోడిపందాలు, పిక్కాట, జూదం, బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నిర్వాహకులు, సహకరించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. కోడికత్తులు తయారీ, విక్రయాలు, రవాణా చేసేవారిపై కూడా కేసులు తప్పవన్నారు. ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సంబంధిత పోలీస్‌స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలకు గానీ, ఎస్పీ (శ్రీకాకుళం) : 6309990800, స్పెషల్ బ్రాంచి సీఐ : 6309990886, పోలీస్‌కంట్రోల్ రూమ్ : డయల్ 112, పోలీస్ వాట్సాప్ నంబర్ : 6309990933కు తెలియజేయాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
శతాధిక వృద్ధురాలు మృతి
ఇచ్ఛాపురం రూరల్: సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మాసుపత్రి అన్నపూర్ణమ్మ (102) మంగళవారం మృతి చెందింది. ఈమెకు గ్రామ పెద్దరెడ్డి మాసుపత్రి వీరాస్వామిరెడ్డి, ఉమాపతిరెడ్డి, రుషికేశవ ముగ్గురు సంతానం కాగా, వీరంతా వ్యవసాయ చేస్తున్నారు. 102 ఏళ్లు నిండినా తన పనులు తానే చేసుకుంటుంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 36 మంది కుటుంబ సభ్యులు ఉండగా, అందులో వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. అన్నపూర్ణమ్మకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అంటే అభిమానం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రేమతో ఆమె కుమారులు కేశుపురం పంచాయతీ బస్టాండ్ వద్ద సుమారు రూ.20 లక్షల విలువైన భూమిని గ్రామ సచివాలయానికి విరాళంగా అందించారు.
గొప్పిలిలో భారత క్రికెటర్ భరత్
మెళియాపుట్టి : భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు కోన శ్రీకర్ భరత్ మంగళవారం మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామంలో సందడి చేశారు. జీపీఎల్ క్రికెట్ పోటీల సందర్భంగా స్థానిక క్రీడాకారులతో కరచాలనం చేసి బెస్ట్ విషెస్ తెలియజేశారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతమవుతుందన్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టమని, ఎంతో సాధన చేసి భారత జట్టుకు ఎంపికకావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి సీనియర్ సివిల్ జడ్జి పల్లి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు పల్లి యోగి, కొల్లాన ఆనంద్, చౌదరి ఫల్గుణరావు తదితరులు పాల్గొన్నారు.
కమ్మసిగడాం జాతర పోస్టర్ ఆవిష్కరణ
రణస్థలం: ఉత్తరాంధ్ర ఇలవేల్పు కమ్మసిగడాం మహాలక్ష్మి తల్లి జాతర ఈ నెల 27 నుంచి 29 వరకు అంగరంగ వైభవంగా జరగనుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం కమ్మసిగడాంలో జాతర పోస్టర్‌ను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 ఉదయం 10.35 గంటలకు పెళ్లిరాట కార్యక్రమం ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారులు ముందుస్తుగా వచ్చి స్థలాలు బాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు వెలిచేటి రామకృష్ణ, తేజ, కోశాధికారి వెలిచేటి రాజశేఖర్, కార్యదర్శులు మన్నె లక్ష్మీప్రసాద్, సురేష్‌కుమార్, వెలిచేటి రాయుడు, మన్నె కృష్ణానందం, తాతీయులు, గోపిన కృష్ణారావు, నడుకుదిటి గిరి, చినబాబు, వెలిచేటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పండగ వేళ పందేలు వద్దు
పండగ వేళ పందేలు వద్దు


