పుడమి తల్లికి ప్రేమతో..
● సంక్రాంతి వేళ.. ధాన్యలక్ష్మి పూజ
● పాతరకు పూజలు చేస్తున్న అన్నదాతలు
ఇచ్ఛాపురం రూరల్ : సంక్రాంతి పండుగ వచ్చిందంటే రైతు ఇళ్లల్లో ధాన్యలక్ష్మి పూజల సందడి మొదలవుతోంది. పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతన్నల మనస్సు పులకించిపోతుంది. కళ్లాల్లో ధాన్యాన్ని ధాన్యలక్ష్మిగా భావించే అన్నదాతలు భూమి తల్లి దయతో వచ్చిన పంటకు కృతజ్ఞతగా సంప్రదాయాలను పాటిస్తారు.
ధాన్యానికి దీపారాధన..
ఆరుగాలం శ్రమించి పండించిన పంట సంక్రాంతి వేళ చేతికి రావడంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండాపోతాయి. సిక్కోలు గ్రామీణ ప్రజలు కళ్లాల్లోని ధాన్యాన్ని నూర్పులు చేసిన అనంతరం లక్ష్మీ వారంగా భావించే గురువారం రోజు ఉదయం రైతు కుటుంబ సభ్యులు కొత్త వస్త్రాలు ధరించి బెల్లంతో పాయసాన్ని తయారు చేస్తారు. ఈ పాయసాన్ని ఉద్దానంవాసులు ‘వార పాయాసం’గా పిలుస్తారు. ధాన్యాన్ని త్రిభుజాకారంగా పోగు చేసి చిటారున నారీకేళం అమర్చుతారు. ధాన్యం కుప్ప చుట్టూ బంతిపూలను అలంకరించి ధాన్యలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన చుక్కల చీరను అలంకరిస్తారు. అనంతరం పాయసాన్ని, పండ్లును నైవేద్యంగా సమర్పించి, దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో ధాన్యలక్ష్మిని ఆహ్వానించి పూజలు చేస్తారు. ధాన్యమే జీవనాధారం అన్న సత్యాన్ని ఈ పూజ గుర్తుకు తెస్తుందని రైతుల విశ్వాసం.
పుడమిలో ఆరు నెలలు..
సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో పాతర గొయ్యి సంప్రదాయం సిక్కోలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని కొన్ని పల్లెల్లో కనిపిస్తోంది. కళ్లాల్లోంచి ఇంటికి తెచ్చిన ధాన్యాన్ని పుడమి తల్లి గర్భంలో ఆరు మాసాలు దాచుకోవడం ఈ ప్రాంత రైతులకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. సుమారు పది అడుగులు మేర గొయ్యిని తీసి అందులో వరి గడ్డిని గోతికి చుట్టూ అందంగా అలంకరించి అందులో ధాన్యం భద్రపరచి మరల వరిగడ్డిని వేసి దానిపై మట్టితో మూసివేస్తారు. సంక్రాంతి మూడు రోజుల పాటు ఈ పాతరను ఆవు పేడతో చక్కగా అలికి, రంగవల్లులతో అలంకరించి పాతరపై నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ ప్రక్రియలో భూమి తల్లిని రైతులు దేవతగా భావిస్తారు.
పుడమి తల్లికి ప్రేమతో..


