పీపీపీ విధానంపై నిరసన తెలపండి
● ఉత్తర్వుల కాపీలను భోగి మంటల్లో వేయండి
● వైఎస్సార్ సీపీ శ్రేణులకు
ధర్మాన కృష్ణదాస్ పిలుపు
నరసన్నపేట: రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం)పై నిరసన తెలియజేసేలా భోగి మంటల్లో పీపీపీ ఉత్తర్వుల కాపీలు వేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని గ్రామాల్లోనూ ఉత్తర్వుల కాపీలను మంటల్లో వేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోగా తిరిగి అప్పుల భారం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 నెలల్లో రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.


