● సంక్రాంతి వేళ అసాంఘిక శక్తులపై పోలీసుల గురి ● పేకాట,
పందెంరాయుళ్లూ బహుపరాక్..
శ్రీకాకుళం క్రైమ్ : సంక్రాంతి పండగ వేళ అసాంఘిక శక్తులపై పోలీసులు గురిపెట్టారు. జిల్లాలో పేకాట, కోడిపందాలు, పిక్కాటలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఇంటిలిజెన్స్ సమాచారంతో టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ప్రత్యేక, లాఅండ్‌ఆర్డర్ పోలీసులతో గట్టి నిఘా పెట్టారు. క్రైమ్‌స్పాట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తుండటమే కాక అనుమానిత ప్రాంతాల్లో దాడులు సైతం ఆరంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించి అల్లర్లకు పాల్పడే వారిపైనా దృష్టిపెట్టారు. ప్రధాన చెక్‌పోస్టులుండే పైడిభీమవరం, పాతపట్నం, ఇచ్ఛాపురం, పర్లాఖిముడి పరిధి సీఐలను ఇప్పటికే ఎస్పీ అప్రమత్తం చేశారు.
చలో ఏవోబీ..
శ్రీకాకుళం, జె.ఆర్.పురం, చిల్లపేట రాజాం, గార, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, కాశీబుగ్గ, కంచిలి ఉద్దానాలు, గారబంద వంటి కొన్ని ప్రాంతాల్లో కొబ్బరితోటలు, జీడితోటల్లో పేకాట శిబిరాలు నడపడంతో గత కొన్నాళ్లుగా పోలీసులు వరుస దాడులు చేశారు. బహిరంగంగా కోర్టు శిక్షలు విధించడంతో కొందరు భయపడ్డారు. అయితే పేకాటనే వ్యాపారంగా ఎంచుకుని రూ.లక్షల నుంచి రూ.కోట్లు ఆర్జించే బడా ఆటగాళ్లు, పాత నిర్వాహకులు మాత్రం తగ్గడం లేదు. ఏవోబీ ప్రాంతాలైన పర్లాఖిమిడి–పాతపట్నం క్లబ్‌లకు, ఇచ్ఛాపురం బోర్డర్, విశాఖపట్నం క్లబ్‌లు, విజయనగరం జిల్లా రాజాంలకు కార్లలో చెక్కేస్తున్నారు. అక్కడి రూ.40 లక్షల నుంచి రూ. 60 లక్షల ఓపెన్ గేమ్‌లకు రూ.లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వీరిలో సామాన్యులతో పాటు బడా బాబులూ ఉన్నారు. ఏడురోడ్ల కూడలిలో కొంతమంది టోకెన్ కోడ్ సిస్టమ్‌తో నగదు, ఫోన్లు పట్టుకుపోకుండా కార్లలో వెళ్తున్నారు. మరికొందరు ఆటలో గేమింగ్‌ను బట్టి వారు చేస్తున్న వ్యాపారంలో భాగంగా నగదు మార్పిడి చేసుకుంటున్నారు.
ఇప్పటికే అనుమానమున్న పాత, కొత్త, బీసీ షీటర్ల కదలికలపై సర్వైలైన్స్ పెట్టాం. 3758 సీసీ కెమెరాలు జిల్లావ్యాప్తంగా ఉన్న ముఖ్యప్రాంతాల్లోనే 2546 పెట్టాం. చెక్‌పోస్టులు, అనుమానిత ప్రాంతాల వద్ద నిరంతర తనిఖీలు చేస్తాం. పట్టుబడితే రౌడీషీట్లు తెరుస్తాం. పేకాట, కోడిపందాల నిర్వాహకులపై బీఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం ఆస్తి జప్తు చేస్తాం. నిర్వహణకు ఎవరైనా ఆశ్రయం కల్పించినా, స్థలాలు ఇచ్చినా వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటాం. సంక్రాంతి పేరిట అసాంఘిక కార్యకలాపాలతో రెచ్చిపోయి మత్తులో అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు.
– కె.వి.మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం
బీసీ షీట్లు.. బైండోవర్లు
గతేడాది కోడిపందాల నిర్వహణపై 22కు పైగా కేసులు నమోదు చేసి రూ.లక్షల్లో నగదు పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో పాతపట్నం, జె.ఆర్.పురం, గార, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో గట్టిగానే పందేలు జరిగాయి. ఈ ఏడాది కూడా జె.ఆర్.పురం, నరసన్నపేట కేంద్రాలుగా పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడానికి కొందరు వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు నిఘా అధికారులకు సమాచారం చేరింది. ఇటీవల నిమ్మాడ, టెక్కలిలో కోడిపందాలకు రిహార్సల్స్ కూడా జరిగినట్లు సమాచారం.
● సంక్రాంతి వేళ అసాంఘిక శక్తులపై పోలీసుల గురి ● పేకాట,
● సంక్రాంతి వేళ అసాంఘిక శక్తులపై పోలీసుల గురి ● పేకాట,
● సంక్రాంతి వేళ అసాంఘిక శక్తులపై పోలీసుల గురి ● పేకాట,


