తగాదాలో గాయపడిన వ్యక్తి మృతి
సారవకోట: గుమ్మపాడు పంచాయతీ అగదల గ్రామంలో గత ఏడాది నవంబర్‌లో భూ తగాదాలో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన బమ్మిడి జయరాం(76) ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరి పంట కోత విషయమై అదే గ్రామానికి చెందిన హనుమంతు రామకృష్ణ, బలగ నాగభూషణంలు జయరాంపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అప్పటి నుంచి శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అప్పట్లో సారవకోట పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.
బెదిరింపు కేసులో ముగ్గురు అరెస్టు
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బెదిరింపు కేసులో కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పలాస రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్, రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు వ్యవహారంలో శనివారం రాత్రి గొడవ జరిగిందన్నారు. 2005 డిసెంబరులో వీటిని కాంట్రాక్టు పొందిన కుర్ధా రోడ్డుకు చెందిన కణితి జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెదిరింపు, దాడి కేసులో నిందితులుగా ఉన్న ఎం.సురేష్, ఎం.చిన్నారావు, ఎం.మోహనరావులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కిషోర్‌కుమార్
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా సంపతిరావు కిషోర్‌కుమార్ మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈయన్ను ఎన్నుకున్నారు. కిశోర్‌కుమార్ 24 ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ కౌన్సిల్ సమావేశాల్లో సంక్షేమ పథకం బోర్డు డైరెక్టర్‌గా గుంట కోదండరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి.శ్రీరామ్మూర్తి, ఎల్.బాబురావు, సీహెచ్ రవీంద్ర, బి.తవిటమ్మ ఎన్నికయ్యారు.
బంగారం చోరీపై
ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన పెద్దింటి గౌరీదేవి నివాసంలో 2 తులాల బంగారం చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 7న విద్యుత్ మరమ్మతుల పనులు చేయించేందుకు కొందరు సిబ్బంది వచ్చారని, వారు సాయంత్రం వెళ్లిపోయాక మేడపై ఉన్న గదిలో బీరువా తెరిచి చూడగా తులం గొలుసు, తులం చెవి రింగులు, రూ.40 వేలు నగదు చోరీకి గురయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ మేరకు గౌరీదేవి ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.


