వంటల ఆటలో మంటలు
● చిన్నారికి తీవ్ర గాయాలు ● రిమ్స్ ఐసీయూలో చికిత్స
శ్రీకాకుళం: నగరంలోని చిన్న బొందిలీపురంలో ఆశాజ్యోతి అనే ఏడేళ్ల చిన్నారి ఆదివారం తన ఇంటి డాబాపై వంటల ఆట ఆడుతుండగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఒంటిపై కాలిపోతున్న దుస్తులతోనే పరిగెత్తుకుంటూ కిందకు వచ్చింది చుట్టుపక్కల గమనించి వస్త్రాన్ని కప్పి మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే చేతులు, ఛాతీ, వీపుపై కాలిన బట్ట అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం చిన్నారిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించాలని రిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు. కాగా, ఈ చిన్నారి అనాథ కావడంతో కొన్నాళ్ల కిందట దత్తత తీసుకున్నారు. తండ్రి లేకపోగా, తల్లి చిన్న షాపును పెట్టుకుని జీవనం సాగిస్తోంది. పేద కుటుంబం కావడంతో విశాఖపట్నం తీసుకువెళ్లి చికిత్స చేయించాలంటే కష్టతరమే. కనీసం సహాయకులుగా ఉండేవారు కూడా లేరని తల్లి సావిత్రమ్మ విలపిస్తోంది. వారం రోజులు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు.


