పోరాట యోధుడు ఓబన్న
శ్రీకాకుళం పాతబస్టాండ్: బ్రిటీష్ సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొని ఉరుకులు పెట్టించిన వీరయోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓబన్న 219వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతులతో సైన్యాన్ని నడిపించి బ్రిటీష్ కంపెనీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారని గుర్తు చేశారు. ఇంతటి చరిత్ర ఉన్న వీరుడికి స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు. ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


