కాశీబుగ్గ / మందస : మందస మండలం గుడారిరాజపురం(జి.ఆర్.పురం) గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అన్నం తిని నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా వాంతులు, విరేచనలు కావడంతో వెంటనే సిబ్బంది స్పందించారు. సచివాలయ ఏఎన్‌ఎం సాయంతో ప్రథమ చికిత్స చేయించారు. అందులో 13 మంది విద్యార్థినులు గురువారం ఉదయానికి కూడా కోలుకోకపోవడంతో 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు డాక్టర్ మద్దిల సంపతిరావు, డాక్టర్ స్వరాజ్యలక్ష్మిలు వైద్యసేవలు అందించారు. ప్రమాదమేమీ లేనప్పటికీ ఎనిమిదో తరగతి విద్యార్థులైన భారతి, యమున, మోహిని, నవ్య, జాహ్నవి, గోపిక, సాహితి, శృతి, జ్ఞానశ్రీలను ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై ఆస్పత్రికి చేరుకున్నారు. మందస పోలీసులు, మండల విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రవికుమార్ పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ లేకే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. అనంతరం పాఠశాలను సందర్శించి వసతుల లేమి, భోజనం సరిగ్గా లేకపోవడంపై మండిపడ్డారు.
20 మందికి అస్వస్థత..
13 మందికి ఆస్పత్రిలో చికిత్స
ఆందోళనకు గురైన తల్లిదండ్రులు


