దర్జాగా దోపిడీ!
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
● అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ● పండగ పూట 50 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ● ఇదే అదనుగా రెండు రెట్లు అదనంగా వసూళ్లు ●వలస జీవులపై పెనుభారం
శ్రీకాకుళం :
సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారిని తిరుగు ప్రయాణంలో చార్జీల రూపంలో దోచుకునేందుకు కొన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పండగ పూట చార్జీలను 50 శాతం వరకు పెంచుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు రెండు నుంచి మూడు రెట్లు చార్జీలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఆర్టీసీ చార్జీల కంటే సాధారణ రోజుల్లో ప్రైవేటు బస్సుల్లో చార్జీలు 50 శాతానికి పైగా అదనంగా ఉంటాయి. అటువంటప్పుడు మరింత పెంచుకోవచ్చని ప్రభుత్వం ఇప్పు డు ఎందుకు అవకాశం కల్పించిందని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వలసదారులపై దెబ్బ..
శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. వీరు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి తప్పనిసరిగా సొంత గ్రామాలకు రావడం పరిపాటి. కనుమ పండగ తర్వాత తిరిగి ఉపాధి కోసం తాము ఉంటున్న ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇటువంటి వారి నుంచి ప్రైవేట్ యాజమాన్యాలు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నప్పటికీ ఏ శాఖ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం నుంచి విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిలో కూర్చొని (సిటింగ్) వెళ్లే బస్సులతో పాటు స్లీపర్ కోచ్‌లు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్సులో సిటింగ్‌కు రూ.800 వరకు, స్లీపర్ కోచ్‌లో రూ.1200 వరకు చార్జీలుగా వసూలు చేస్తుంటారు. ఏసీలో ప్రయాణించాలంటే మరో రెండు వందల రూపాయలు అదనం. అయితే కనుమ రోజు నుంచి విజయవాడకు నాన్ ఏసీలో కూర్చొని వెళ్లేందుకు రూ.1500, ఏసీలో రూ.1800, స్లీపర్ కోచ్ ఏసీలో రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ప్రయాణం మరింత భారంగా మారిందని చెప్పాలి. ఇదివరలో నాన్ ఏసీ బస్సులో కూర్చుని వెళ్లేందుకు రూ.1200 నుంచి రూ.1400, స్లీపర్‌లో రూ.1600 వరకు చార్జీగా వసూలు చేసేవారు. ఏసీలో మరో 300 రూపాయలను అదనంగా ప్రయాణికుల నుంచి తీసుకునేవారు. ఇప్పుడు నాన్ ఏసీ బస్సులో కూర్చుని వెళ్లేందుకు రూ.2,200, స్లీపర్‌లో రూ.3300 వసూలు చేస్తున్నారు.
టిక్కెట్లు బ్లాక్ చేసి..
టికెట్లను ఆన్‌లైన్లో విక్రయిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ వీటిని కొందరు వ్యక్తుల ద్వారా బ్లాక్ చేయిస్తూ మరింత అదనపు ధరలకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు అమ్ముకుంటున్నారు. ఇలా కొందరు దారి దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పాలి.
కొన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు పర్మిట్ ఒక బస్సుకు మాత్రమే తీసుకొని అదే నెంబర్‌తో రెండు మూడు బస్సులను తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకటి, రెండు సందర్భాల్లో ఇటువంటి వాటిని గుర్తించినా రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తుండటంతో తిరిగి యథాస్థితికి వస్తున్నాయి. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ వేసి, బిల్లులు లేని సరుకును రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి ఈ రకంగా కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు గండి కొడుతున్నాయి. ఇప్పటికై నా రవాణా శాఖ అధికారులు దృష్టి సారించి ప్రయాణికులపై అధిక భారం పడకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తాం. నిర్ణీత మొత్తానికి మించి చార్జీలు పెంచితే చర్యలు తీసుకుంటాం. జరిమానాలు విధిస్తాం. ఒకే నెంబర్‌తో ఎక్కువ సర్వీసులు తిప్పుతున్నట్లు మా దృష్టికి వస్తే బస్సును సీజ్ చేస్తాం.
– విజయసారధి, జిల్లా రవాణాశాఖ అధికారి


