పండగ పూట పస్తులు
రైతు సేవా కేంద్రం సిబ్బందికి తప్పని ఇబ్బంది
పూర్తిస్థాయిలో వేతనాలు అందించని వైనం
ధాన్యం సేకరించిన కష్టానికి దక్కని ఫలితం
ఆమదాలవలస రూరల్: ధాన్యం సేకరించిన తాత్కాలిక సిబ్బందిని పండగ పూట కూడా అధికారులు కష్టపెట్టారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టారు. ఈ మూడు నాలుగు నెలల పాటు ధాన్యం సేకరణ కోసం టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ), అటెండర్ ప్రతి కేంద్రానికి ముగ్గురు చొప్పున వ్యవసాయ శాఖాధికారులను నియమించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 632 రైతు సేవా కేంద్రా లు ఉండగా 1896 మందిని తీసుకున్నారు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.15,000, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.12,000, అటెండర్‌కు రూ.8,000 చొప్పున వేతనం కూడా నిర్ణయించారు. వీరిలో మెజారిటీ సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు.
టెక్నికల్ అసిస్టెంట్ రైతుల వద్దకు వెళ్లి తేమ శాతంతో పాటు ధాన్యంలో నాణ్యతలను గుర్తించారు. గుర్తించిన ధాన్యంకు సంబంధించి రైతు సేవా కేంద్ర ఇన్‌చార్జి వేసిన షెడ్యూల్ ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రక్ షీట్లు వేసి మిల్లులకు పంపించాలి. వీరు గత రెండు నెలలుగా రైతుల ఇబ్బందులు తెలుసుకుని రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీరిలో చాలా మందికి వేతనాలు సరి గా అందలేదు. నిరుద్యోగులుగా ఉన్న తమతో ధాన్యం సేకరణ పేరుతో సేవలు చేయించుకొని వేతనాలు అందించకపోవటం చాలా అన్యాయ మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో పనిచేసిన సిబ్బందికి నెల నెలా వేతనాలు అందించినప్పటికీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో తమకు అలా ఇవ్వడం లేదని అంటున్నారు. మరో రెండు నెలల పాటు రైతులకు ఇంకా వీరి సేవలు ఎంతో అవసరం. అయితే వేతనాలు అందని వారు పనిచేయటానికి అంతగా మొగ్గు చూపటంలేదు. ఇప్పటికై నా వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా సేవా కేంద్రాల తాత్కాలిక సిబ్బందికి వేతనాలు అందించాలని కోరుతున్నారు.


