● డివిజన్ అధికారుల సమీక్షలో
జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
టెక్కలి: జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలోని రెవెన్యూ శాఖలో వివిధ విభాగాల అధికారులతో గురువారం టెక్కలిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా పీజీఆర్‌ఎస్‌కు వస్తున్న రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి అర్జీపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పరిష్కార మార్గం చూపాలన్నారు. రీసర్వేకు సంబంధించి పైలట్ గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ల్యాండ్ బ్యాంకింగ్ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలన్నారు. కోర్టు వివాదాలు భూవ్యవహారాల్లో చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. అనంతరం రీసర్వేపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు ఎం.కృష్ణమూర్తి, సాయిప్రత్యూష, జి.వెంకటేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ల్యాండ్ సర్వే విభాగం ఏడీ విజయకుమార్, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సర్వేయర్లు, వీఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.