ఆహ్లాదకరం.. అంతే ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదకరం.. అంతే ప్రమాదకరం

Nov 29 2026 12:58 PM | Updated on Nov 29 2026 12:58 PM

పెనుకొండ రూరల్‌: రిజర్వాయర్‌లో వరుస ఘటనలతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. అవగాహనా రాహిత్యంతో ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకుల పాలిట గొల్లపల్లి జలాశయం మృత్యుకూపంగా మారుతోంది. పెనుకొండ సమీపంలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పట్టణంలోని పలు దేవాలయాలు, కోట గోడలు సందర్శించిన అనంతరం సువిశాలమైన గొల్లపల్లి రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటుంటారు. వారాంతాల్లో రిజర్వాయర్‌కు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. హంద్రీ–నీవా కాలువ ద్వార కృష్ణా జలాలు గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేరుతుంటాయి. ఈ రిజర్వాయర్‌ నుంచి కియా మోటర్స్‌, నాసిన్‌ పరిశ్రమలకు, పెనుకొండ, హిందూపురం, మడకశిర ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంటుంది.

కనిపించని భద్రత ప్రమాణాలు..

రిజర్వాయర్‌ వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించలేదు. ఒకే ప్రాంతంలో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూ.. ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వందలాదిగా వచ్చే పర్యాటకులకు కనీస భద్రతా చర్యలు కల్పించడాన్ని పక్కకుపెట్టి, కేవలం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోనే తమ పని అయిపోయిందన్నట్టు చేతులు దులుపుకోవడంపై స్థానికులు, పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్‌ వాటర్‌ వద్ద వరుస ఘటనలను దృష్టిలో ఉంచుకొని భద్రతా సిబ్బందిని నియమించి.. ప్రజల ప్రాణాలకు భరోసానివ్వాలని రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌ అధికారులను పర్యాటకులు కోరుతున్నారు.

అందాలు తిలకించడానికి వస్తూ..

హంద్రీ–నీవా కాలువ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు చేరే ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. చుట్టూ కొండలు.. పచ్చిక బయళ్లుతో ఆ ప్రాంతం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. యువకులు ఈత కొట్టేందుకు, స్నానాలు చేసేందుకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. హంద్రీ – నీవా కాలువ ద్వారా చేరే నీటి ప్రవాహాన్ని, ప్రవాహం ద్వారా ఏర్పడిన నీటిలోని గుంతలను. పర్యాటకులు అంచనా వేయలేకపోతున్నారు. దీంతో బురద మట్టిలో చిక్కుకుపోయి మృత్యువాత పడుతున్నారు.

గొల్లపల్లి రిజర్వాయర్‌ వద్ద

కానరాని భద్రతా ప్రమాణాలు

హెచ్చరిక బోర్డులతోనే

చేతులు దులిపేసుకున్న అధికారులు

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం

మరో ఘటన జరగకమునుపే

కళ్లు తెరవాలంటున్న పర్యాటకులు

ఒక్క ఘటనతో

మూడు కుటుంబాల్లో విషాదం

అక్టోబర్‌ 16న పట్టణానికి చెందిన మూడు కుటుంబాలు విహారయాత్రగా జలాశయానికి వెళ్లారు. కృష్ణా జలాలు జలాశయంలోకి చేరే ప్రదేశంలో స్నానాల కోసం దిగడంతో అనూహ్య రీతిలో మృత్యువు కబలించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అలానే ఈ ఏడాది మార్చి 23న ఒడిశాకు చెందిన ఫిలిప్పిన్‌ నీటమునిగి చనిపోయాడు. సమీపంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే వారు ప్రాణాలు కోల్పోయినట్టు పలువురు వాపోతున్నారు. అధికారల అలసత్వం వల్ల మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికై నా పర్యాటకుల భద్రతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భద్రత కల్పిస్తాం

రిజర్వాయర్‌ వద్ద ప్రజలకు భద్రత కల్పించే దిశగా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తాం. ఇప్పటికే తాత్కాలిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. సిబ్బంది ఏర్పాటు విషయాన్ని పరిశీలించాల్సిందిగా విన్నవిస్తాం. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తాం.

– శివ శంకర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌,

గొల్లపల్లి రిజర్వాయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement