పుట్టపర్తి అర్బన్: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పుట్టపర్తి డివిజన్‌లో పుట్టపర్తి రూరల్, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీ చెరువు, అమడగూరు మండలాలు ఉండగా, కదిరి డివిజన్ పరిధిలో కదిరి రూరల్, తనకల్లు, తలుపుల, ఎన్‌పీకుంట, గాండ్లపెంట, నల్లచెరువు మండలాలు ఉన్నాయి. 12 మండలాల్లో కలిపి మొత్తం 169 గ్రామ పంచాయతీలు, 1,730 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో రెండో విడతకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కదిరి డివిజన్లో 18 అత్యంత సమస్యాత్మక, 23 సమస్యాత్మక గ్రామాలు ఉన్నట్లు గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే పుట్టపర్తి డివిజన్లో 23 అత్యంత సమస్యాత్మక, 31 సమస్యాత్మక గ్రామాలు ఉన్నట్లు గుర్తించి తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెండో విడత ఎన్నికల కోసం ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 31 మంది సీఐలు, 51 మంది ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, హోంగార్డులు కలిపి మొత్తంగా 1,326 మందిని నియమించినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 30 యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా ఉంటాయన్నారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఊరూరా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలవడంతో రెండో విడతలోనూ సత్తా చూపేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అధికార పార్టీ ఆగడాలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారు. ఓటర్ల పరిధిని ఇష్టానుసారం మార్చి వార్డులు కేటాయించారు. దీంతో ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఒక్కొక్కరికి ఒక్కోవార్డులో ఓటు హక్కు కల్పించడంతో ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తికి 1వ వార్డు పరిధిలో ఓటు ఉంటే ఆయన భార్యకు మరో వార్డు, వారి కూతుళ్లు, కుమారులకు ఇంకో వార్డుల్లో ఓట్లు ఉండటం, ఓటరు స్లిప్పులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది సచివాలయాల వద్దకు, స్థానిక నాయకుల వద్దకు తిరుగుతున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. పార్టీ గుర్తులు లేకపోవడం వల్ల తమ వార్డు అభ్యర్థి ఎవరు...గుర్తు ఏమిటంటూ ఆరా తీస్తున్నారు.
అధికార కూటమి నేతలు ఊరూరా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మద్యం, చీరలు, డబ్బుల పంపిణీకి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ప్రజలే సమాచారం ఇచ్చినా అటువైపు తొంగిచూడటం లేదు. బహిరంగంగా చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నా... ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
7 గంటల నుంచి పోలింగ్..
ఆ తర్వాత ఓట్ల లెక్కింపు
జోరు మీదున్న వైఎస్సార్‌సీపీ
మద్దతుదారులు
రెండవ విడత పంచాయతీ పోరు వివరాలు ఇలా..
మారిన వార్డులు.. ఇబ్బందుల్లో ఓటర్లు..
జోరు మీదున్న వైఎస్సార్‌సీపీ..
ఊరూరా ప్రలోభాల పర్వం..
పటిష్ట బందోబస్తు..


