కర్నూలు(హాస్పిటల్): ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఫిమేల్)/ఏఎన్‌ఎం వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఫోరెన్సిక్, ఫార్మకాలజీ విభాగాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు చీఫ్ ఎగ్జామినర్‌గా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ వ్యవహరించనున్నారు. ఆమెతో పాటు ఎక్స్‌టర్నల్ స్క్వాడ్‌గా ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ మహేశ్వరప్రసాద్, 10 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షలను పర్యవేక్షించనున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రెండు ప్రభుత్వ ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఏ) స్కూల్స్, నాలుగు ప్రైవేటు పాఠశాలలల విద్యార్థినులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థినీలు 87 మంది రెగ్యులర్, 31 మంది సప్లిమెంటరీ, రెండవ సంవత్సరం విద్యార్థినులు 134 మంది రెగ్యులర్, 12 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 30, డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో థియరీ, 4, 5వ తేదీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రథమ సంవత్సరానికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు పరీక్ష జరుగనున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థినులు డిసెంబర్ 1, 2, 3, 4వ తేదిల్లో పరీక్ష రాయనుండగా, రెండవ సంవత్సరం విద్యార్థినులు ఈ నెల 30, డిసెంబర్ ఒకటో తేదీన పరీక్షలు రాయనున్నట్లు డీఐఓ డాక్టర్ ఉమ తెలిపారు.
ట్రక్ టైర్ పగిలి చెలరేగిన మంటలు
కూడేరు: కియా కార్ల తయారీ కంపెనీకి మెటీరియల్‌ను తరలిస్తున్న ట్రక్ అగ్ని ప్రమాదం తప్పింది. వివరాలు.. మండల పరిధిలోని సైనికాపురం వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారిపై శనివారం పుణె నుంచి పెనుకొండ వద్ద కియా కార్ల ఫ్యాక్టరీకి మెటీరియల్ తరలిస్తున్న ట్రక్ టైర్ పగిలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ట్రక్ డ్రైవర్ సురేష్, రహదారిపై వెళ్తున్న వాహనదారులు స్పందించి రహదారి పక్కన అనంత తాగునీటి పైపులైన్ నుంచి లీకవుతున్న నీటిని బకెట్లు, వాటర్ బాటిల్స్‌తో తెచ్చి మంటలు వ్యాప్తి చెందకుండా చేశారు. లేదంటే రూ.లక్షలు విలువ చేసే మెటీరియల్‌తోపాటు ట్రక్ కాలి బూడిదయ్యేవి. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ సంజీవులు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ట్రాిఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.
ఉరుసు నుంచి తిరిగెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
● కొనకొండ్ల వద్ద అదుపు తప్పిన ద్విచక్ర వాహనం
● ఒకరు మృతి, మరొకరికి గాయాలు
వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన మహబూబ్ బాషా(26) మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు బళ్లారికి చెందిన మహాబూబ్‌బాషా, షాషా వలీతో కలిసి ద్విచక్ర వాహనంలో శుక్రవారం బళ్లారి నుంచి పెనుకొండ దర్గాకు వెళ్లారు. శనివారం పెనుకొండ నుంచి సొంతూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల శివారు ప్రాంతానికి చేరుకున్నాక ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన మహబూబ్ బాషా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, షాషావలికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడి తల్లి పర్వీన్ భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వజ్రకరూరు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు మహబూబ్‌బాషాకు నాలుగు నెలల క్రితమే వివాహమైనట్లు పోలీసులు వెల్లడించారు.


