ప్రశాంతి నిలయం: సత్యసాయి శత వర్ష జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ప్రముఖ ఫ్లూట్ వాయిద్య కళాకారుడు పండిట్ రాకేష్ చౌరాసియా బృందం ఫ్లూట్ వాయిద్య కచేరీ నిర్వహించింది. చక్కటి స్వరాలోలికిస్తూ నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. వయోలిన్ వాయిద్యం భక్తులను మంత్రముగ్దులను చేసింది.
నేడు రథోత్సవం
పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పుట్టపర్తి పురవీధులను ప్రత్యేకంగా అలంకరించారు. పచ్చటి తోరణాలు, చక్కటి ముగ్గులతో రోడ్లను తీర్చిదిద్దారు. ఉదయం 8 గంటలకు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం 8.10 గంటలకు పండితులు వేదమంత్రోచ్ఛారణ నడుమ సత్యసాయి సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నారు. 9.45 గంటలకు పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవం ప్రారంభమవుతుంది. ప్రశాంతి నిలయం ఉత్తర ద్వారం వద్ద ప్రారంభమై పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పెద వెంకమరాజు కళ్యాణ మంటపం వద్ద ముగియనుంది. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో కసాడే ఆఫ్ డివైన్ మెలోడీ పేరుతో శ్వేతా మోహన్ సంగీత కచేరీ నిర్వహించనున్నారు.
పర్తికి చేరిన ‘ప్రేమ ప్రవాహిని’
సత్యసాయి శత వర్ష జయంతి వేడుకల సందర్భంగా ఏడాది క్రితం సత్యసాయి విలువలను చాటుతూ ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథాలు యాత్రను పూర్తి చేసుకుని మంగళవారం ప్రశాంతి నిలయం చేరాయి. ఏడాది పాటు ఐదు ప్రేమ ప్రవాహిని రథాలు దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, గ్రామాలను సందర్శించి సత్యసాయి విలువను చాటుతూ యాత్రను కొనసాగించాయి. మంగళవారం ఉదయం ఉరవకొండకు చేరుకున్న రథాలు సాయంత్రం ప్రశాంతి నిలయం చేరుకున్నాయి. ప్రశాంతి నిలయంలో ప్రేమ ప్రవాహిని రథాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
పర్తికి చేరిన ‘ప్రేమ ప్రవాహిని’ రథాలు
నేడు సత్యసాయి రథోత్సవం


