● జిల్లాలోని 397 ఎంపీటీసీ, 32 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
● 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన
● నవంబరు 3న పోలింగ్.. నవంబర్ 5న ఫలితాలు
ప్రశాంతి నిలయం: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 397 ఎంపీటీసీ స్థానాలకు, 32 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు విధించారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనల ద్వారా పోలింగ్ వాయిదా పడితే నవంబర్ 4న రీ పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు..ఫలితాల విడుదల ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, నామినేషన్ కౌంటర్ల వద్ద ప్రత్యేక బందోబస్తుతో పాటు వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు.


