పెనుకొండలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

పెనుకొండలో ఉద్రిక్తత

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

పెనుకొండ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ పరిశీలనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4, 14 వార్డుల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 14వ వార్డుకు వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్‌ వేసిన కుమ్మరదొడ్డికి చెందిన నాల్‌బండ్‌ సద్దాం హుస్సేన్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో సయ్యద్‌ సద్దాం హుస్సేన్‌ అని పెట్టుకున్నారని, అతను ఓసీ కేటగిరీకి వస్తారని అందువల్ల బీసీకి రిజర్వ్‌ అయిన స్థానంలో పోటీ చేయడం కుదరదంటూ టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. అయితే ఫేస్‌బుక్‌ పేజీలో ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటారని, దాన్ని సాకుగా చూపకూడదని వైఎస్సార్‌సీపీ నేతలు వాదించారు. అలాగే నాల్‌బండ్‌ సద్దాం హుస్సేన్‌ కులం, ఇతర ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. అలాగే 4వ వార్డుకు నామినేషన్‌ వేసిన నాగలకట్టకు చెందిన భాస్కర్‌ యాదవ్‌ నగర పంచాయతీకి పన్నుబాకీ ఉన్నారంటూ టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. అయితే తాను పెనుకొండ పంచాయతీగా ఉన్నప్పుడు చెల్లించాల్సిన బకాయి వ్యవహారంపై కోర్టుకు వెళ్లానని, ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇదే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేశానన్నారు. అలాగే మున్సిపాలిటి నుంచి ‘నో డ్యూ’ సర్టిఫికెట్‌ కూడా నామినేషన్‌ తో కలిపి దాఖలు చేశానని వెల్లడించారు. అయితే పంచాయతీ వేరు, మున్సిపాలిటీ వేరంటూ టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా... వంద మీటర్లు ముందే పోలీసులు అడ్డుకుని ఆంక్షలు విధించారు. దీంతో ఆమె ఫోన్‌ ద్వారా సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశారు. వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు అశ్వర్థ నారాయణ, శ్రీనివాసులు నామినేషన్‌ ధ్రువపత్రాలు, కోర్టు వివాదాన్ని విశదీకరించినా, నామినేషన్‌ ఆమోదానికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ఎన్నికల సిబ్బంది, కమిషనర్‌ సతీష్‌కుమార్‌ అభ్యర్థులను గంటల తరబడి నిరీక్షించేలా చేశారు. చివరకు సాయంత్రం ఆరుగంటల తర్వాత నామినేషన్‌ ఆమోదించినట్లు అభ్యర్థుల పేర్లు నోటీస్‌ బోర్డులో కనబరిచారు.

టీడీపీ కవ్వింపు చర్యలు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వెళ్తుండగా... టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. ‘ఉషశ్రీ గో బ్యాక్‌’ అంటూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో అరగంట పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపివేశారు.

టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల

నామినేషన్లపై అభ్యంతరాలు

ఎన్నికల సిబ్బంది వత్తాసు

పెనుకొండ రూరల్‌: ‘‘ ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదు. అందరూ చట్టానికి, నిబంధనలకు లోబడే వ్యవహరించాలి. నామినేషన్లు అన్నీ సవ్యంగా ఉన్నా...తిరస్కరించేలా తీవ్రంగా ప్రయత్నించారు..మీకు నిజంగా దమ్ముంటే ఎన్నికల్లో పోటీపడండి...ప్రజా తీర్పును గౌరవించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ ప్రత్యర్థి పార్టీల నాయకులకు సవాల్‌ విసిరారు. సోమవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయని మంత్రి సవితకు ఓటమి భయం పట్టుకుందని, అందువల్లే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించేలా కుట్రలు చేశారన్నారు. అలాగే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను టార్గెట్‌ చేసుకుని దాడులకు దిగుతున్నారన్నారు. నామినేషన్‌ పత్రాలు లాక్కోవడం, దాడులు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చిన్న చిన్న అంశాలను కూడా సాకుగా చూపెడుతూ, నామినేషన్‌ పరిశీలనలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. పెనుకొండలో 14వ వార్డు అభ్యర్థి సద్దాం హుస్సేన్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉన్న పేరు, అఫిడవిట్‌లో ఉన్న పేరు వేరుగా ఉందని టీడీపీ నేతలు అభ్యంతరం చేయడం, అధికారులు దాన్ని పరిగణనలోకి తీసుకోవడం కామెడీ స్కిట్‌ను తలపిస్తోందన్నారు. ఇక 4వ వార్డు అభ్యర్థి భాస్కర్‌ యాదవ్‌ అన్ని ధ్రువీకరణపత్రాలు దాఖలు చేయడంతో పాటు అఫిడవిట్‌లో సమగ్ర వివరాలు తెలిపినా అధికారులు నామినేషన్‌ ఆమోదానికి గంటల సమయం తీసుకోవడం చూస్తే వారు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతోందన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం

మంత్రి సవిత చెప్పిందంటూ అధికారులు ఏది పడితే అది చేస్తామంటే ఊరుకోబోమని ఉషశ్రీచరణ్‌ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండపై ఇప్పటికే గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే ఆమరణ నిరాహార దీక్షలకు కూడా సిద్ధమని హెచ్చరించారు. ఆమె వెంట వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి కె. శ్రీనివాసులు, లీగల్‌ సెల్‌ సభ్యులు అశ్వర్థ నారాయణ, శ్రీనివాసులు, విశ్వనాథ్‌ నాయక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement