కదిరి: కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆయా పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కదిరి నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారి అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్థానిక సబ్ రిజస్ట్రార్ కార్యాలయం నుంచి ‘కె.ట్యాక్స్’ వసూలు చేస్తున్నారని కూటమి నేతలు ఇటీవల కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ జయంతి నాడు కూడా కూటమి అసమ్మతి నేతలు ఎమ్మెల్యేతో కలిసి రాకుండా వేర్వేరుగా వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం చర్చనీయాంశమైంది.
కందికుంటకు దూరమవుతున్న నేతలు
సొంత పార్టీ నేతలతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు సైతం ఎమ్మెల్యే కందికుంటకు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. టీడీపీ నేత, కదిరికి చెందిన కొత్తచెరువు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమనాథరెడ్డి, కదిరి మండలం సున్నపుగుట్టతండాకు చెందిన గిరిజన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సోమ్లానాయక్, టీడీపీ న్యాయవాది నాగేంద్రప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు కందికుంటకు దూరమై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డికి దగ్గరయ్యారు. అలాగే వేదికలపై కందికుంట పక్కనే కూర్చునే జనసేన కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్ సైతం కందికుంట వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. ఆయన కూడా విష్ణుతో చేతులు కలిపారు. గత రెండేళ్లలో బీజేపీని వీడి కందికుంట సమక్షంలో టీడీపీలో చేరిన ఎంతోమంది మళ్లీ ఇప్పుడు పచ్చ కండువాను పక్కన పడేసి విష్ణు సమక్షంలో కమల దళంలో కలిసిపోతున్నారు ఇంకా మరికొందరు నేతలు కందికుంటకు దూరమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.
నేతల మధ్య ఆదిపత్య పోరు
తన అవినీతిని ప్రశ్నిస్తున్న బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిని ఎలాగైనా దెబ్బకొట్టాలని ఎమ్మెల్యే కందికుంట ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా ఆయనకు గన్‌మెన్లు కూడా లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నాడు విష్ణువర్ధన్‌రెడ్డిని తేరుపైకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుకోవడం సంచలనం రేపింది. విష్ణు వర్గీయుడు చంటి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు కొబ్బరికాయలు విక్రయించుకునే టెండర్ దక్కించుకుంటే దాన్ని కూడా ఈఓ శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించారు. ఈ టెంకాయల పంచాయితీ హైకోర్టు దాకా వెళ్లింది. కోర్టులో తుది తీర్పు కూడా రాకనే ఎమ్మెల్యే ఎవరికై తే ఆ టెండర్ ఇప్పించాలనుకున్నాడో ఆయనే ప్రస్తుతం అక్కడ అనధికారికంగా టెంకాయలు అమ్ముతూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు.
కదిరిలో తారస్థాయికి చేరిన వర్గ విభేదాలు
ఎమ్మెల్యే కందికుంట అవినీతిపై ప్రశ్నిస్తున్న నాయకులు
బీజేపీ, జనసేన నేతల ఇమేజ్ డ్యామేజ్‌కు ఎమ్మెల్యే యత్నం !
ఎత్తుకు పైఎత్తుతో రంజుగా రాజకీయం
రెండేళ్లుగా ఆలయ చైర్మన్ కుర్చీ ఖాళీ
ఆదిపత్య పోరు కారణంగా నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కుర్చీ రెండేళ్లుగా ఖాళీగా ఉంది. జనసేన పార్టీ కదిరి ఇన్‌చార్జ్ భైరవప్రసాద్‌కు ఈ పదవి ఖరారైందని కూటమి నేతలే చెప్పారు. అయితే ఈ పదవిని తనకు ఎంతో నమ్మకంగా ఉన్న ఆయిల్ మిల్ సూరికి ఇప్పించాలని కందికుంట గట్టిగా పట్టుబడుతున్నారు. ఆలయానికి సంబంధించి 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను సైతం సూరి చేతుల మీదుగానే ఆవిష్కరించారు. ఆలయంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో కూడా సూరి దర్శనమిస్తున్నారు. ఆ పదవి తనకు రాకుండా అడ్డుపడటంతో పాటు తనను డబ్బుతో మ్యానేజ్ చేశామని కందికుంట అనుచరులు బహిరంగంగా చెప్పుకోవడాన్ని భైరవ ప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. పోలీసు కేసులున్న సూరి ఆ పదవికి అర్హుడు కాదని ఆయన చెబుతున్నారు. ఇలా కదిరి కూటమి నేతల పంచాయితీ ఆయా పార్టీల అధిష్టానం వరకూ వెళ్లింది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


