పేరూరు.. రైతు కన్నీరు | - | Sakshi
Sakshi News home page

పేరూరు.. రైతు కన్నీరు

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

రామగిరి: అధికారంలోకి రాగానే పేరూరు డ్యాంకు నీరు తెస్తామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రజాప్రతినిధి రెండేళ్లుగా కనీసం డ్యాంవైపు కన్నెత్తి చూడలేదు. పైగా గేట్ల మరమ్మతు పేరుతో డ్యాంలో ఉన్న అర టీఎంసీ నీటిని సైతం దిగువకు వదిలేశారు. ప్రస్తుతం డ్యాంలో చుక్కనీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతోపాటు తాగేందుకు గుక్కెడు నీరులేక ఇబ్బంది పడుతున్నారు. రైతులు సాగుచేసిన పంటలను సైతం పశువులకు వదిలేసిన పరిస్థితి నెలకొంది.

బీళ్లుగా మారిన ఆయకట్టు

పేరూరు డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1.81 టీఎంసీ కాగా, రాప్తాడు, అనంతపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో డ్యాం ఆయకట్టు ఉంది. ప్రత్యక్షంగా 12 వేల ఎకరాలతోపాటు పరోక్షంగా మరో 5 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను పండించుకునే వారు. అయితే ప్రస్తుతం డ్యాంలో నీరులేనందున రామగిరి మండలంలోని పేరూరు, పి.కొత్తపల్లి, దుబ్బార్లపల్లి, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్దకొండాపురం, రెడ్డివారిపల్లి, తిమ్మాపురం, మంగాపురం, ఎంసీ పల్లి, గరిమేకలపల్లి, కనగానపల్లి మండలంకోనేటినాయినిపాళ్యం, శివపురం, మద్దెలచెరువు, వేపకుంట, భానుకోట, కొండపల్లి, పాతపాళ్యం, తగరకుంట, కంబదూరు మండలంలోని చెన్నంపల్లి, రాళ్లఅనంతపురం, నూతిమడుగు, అచ్చంపల్లితోపాటు రాప్తాడు, అనంతపురం రూరల్‌ మండలాల్లోని చాలా గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయి.

బయటకురాని గంగమ్మ

పేరూరు డ్యాంపైనే ఆధారపడి పంటలు సాగుచేసే రైతులు ఈ సారి వేరుశనగ, మొక్కజొన్న, టమాట, కళింగర, బీర, కాకర, వరి తదితర పంటలు వేశారు. అయితే డ్యాంలో నీరు లేక సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. బోర్లన్నీ ఎండిపోయి సాగునీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుండగా...రైతులు అప్పులు చేసి వందలాది అడుగుల మేర బోర్లు తవ్విస్తున్నప్పటికీ గంగమ్మ బయటకు రావడం లేదు. ఇటు పంటలు లేక అటు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక చాలా మంది రైతులు కుటుంబపోషణకు ఇప్పటికే వలస బాట పట్టారు. మరికొందరు ఊళ్లు విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

గతమెంతో ఘనం....

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు కర్ణాటక సీఎంతో చర్చించి హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలను పేరూరు డ్యాంకు మళ్లించారు. అదే సంవత్సరం వరుణుడు కరుణించడంతో ఎగువ భాగాన విస్తారంగా వర్షాలు కురవడంతో పేరూరు డ్యాం జలకళను సంతరించుకుంది. జలాశయం పొంగిపొర్లడంతో ఏకంగా మూడు నెలలపాటు డ్యాంకున్న 8 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో డ్యాంను చూసేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లావాసులతోపాటు కర్ణాటక నుంచి కూడా భారీగా తరలివచ్చారు. దీంతో డ్యాంవద్ద కొన్నిరోజుల పాటు పర్యాటకుల సందడి కనిపించింది. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండటంతో చేపల వేటతో జాలర్లకు ఉపాధి దొరికింది. ఇక బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లిన రైతులు తిరిగివచ్చి తమ భూముల్లో పంటలను పండించుకుని కుటుంబ పోషణ సాగించారు.

హామీలు... నీటిమీద రాతలు

రైతులకు హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు సర్కార్‌

చుక్కనీరులేక ఒట్టిపోయిన

పేరూరు జలాశయం

భారీగా పడిపోయిన భూగర్భజలమట్టం

800 అడుగుల మేర బోర్లు వేసినా ఫలితం శూన్యం

సాగునీరులేక బీళ్లుగా మారిన

వేలాది ఎకరాలు

బోర్ల కింద వేసిన పంటలనూ

జీవాలకు వదిలేసిన వైనం

ప్రభుత్వం స్పందించకుంటే వలసలే...

నాడు

నేడు

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే తాగేందుకు గుక్కెడు నీరులేక, పంటలను సాగు చేసుకొనేందుకు వీలులేక ఈ ప్రాంత ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే పేరూరు డ్యాంకు నీరందించాలని గతవారం కలెక్టర్‌కు వైఎస్సార్‌ సీపీ నేతలు విన్నవించారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున రోజురోజుకు బోరుబావుల్లో నీరు అడుగంటున్నాయని, రాబోయే రోజుల్లో తాగునీటికీ ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని ఈప్రాంత వాసులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement