ప్రశాంతి నిలయం: ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలో ఉద్యానశాఖ, ఉపాధి హామీ పథకాలలో రూ.కోట్ల అవినీతిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తేటతెల్లం చేశారు. అధికార పార్టీ నాయకుల అండతో బోగస్ బిల్లులతో ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయాన్ని బట్టబయలు చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేసిన ఆయన.. కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కలసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్వాకాన్ని వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడుతూ... ముదిగుబ్బ మండలంలో రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో టమాట మొక్కలకు సపోర్టుగా కట్టెలు, మామిడి కాయలు నాణ్యత వచ్చేందుకు ఫ్రూట్ కవర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందిందన్నారు. అయితే ఉద్యానశాఖ అధికారులు కుమ్మకై ్క అర్హులకు కాకుండా అనర్హులకు కొండలు, గుట్టలు ఉన్న వారికి బోగస్ బిల్లులు మంజూరు చేశారన్నారు. ఒ్కచోట పంట సాగు చేస్తే మరోచోట బోగస్ వ్యక్తులకు జియోట్యాగ్ చేసి మరీ ఈ దందా కొనసాగించారన్నారు. ముఖ్యంగా జేకేపల్లి ఆర్‌బీకేలో పని చేసే ప్రియాంక, ముదిగుబ్బ మండల వ్యవసాయ శాఖలో ఏఈఓగా పని చేసే మనోహర్ నాయక్, ఎంపీఈఓ సరళ, హార్టికల్చర్ ఆఫీసర్ అమరేశ్వరి ఈ అవినీతిలో ప్రధాన భూమిక పోషించారన్నారు. మొత్తంగా మండలంలో రూ.1.38 కోట్లకుపైగా ప్రజాధనానికి బోగస్ వ్యక్తుల పేరిట బిల్లులు మంజూరు చేశారన్నారు. వారు అంతటితో ఆగకుండా తమ కుటుంబ సభ్యుల పేరిట కూడా నకిలీ బిల్లులు పెట్టుకున్నారన్నారు. దొరిగిల్లు గ్రామంలో 571 ఎకరాల్లో 252 మంది రైతులు టమాట సాగు చేసినట్లుగా చూపి పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను తాము సమాచారం హక్కు చట్టం కింద సేకరించి ఆధారాలను బహిర్గతం చేశామన్నారు. అవినీతి సొమ్మును ఉద్యానశాఖ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వాటాలు వేసి పంచుకున్నారన్నారు.
ఉపాధి హామీలోనూ అంతులేని అవినీతి
ముదిగుబ్బ మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రూ.10 కోట్ల ఉపాధి హామీ పనులు జరిగాయని, సామాజిక తనిఖీ తూతూమంత్రంగా చేసిన అధికారులు అవినీతి, అక్రమాలను బయటకు పొక్కకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. సామాజిక తనిఖీ గురించి ప్రజలకు తెలపకుండా గోప్యంగా నిర్వహించారన్నారు. మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఆడిట్ జరిగిన ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులను మేట్‌లతో ఇష్టానుసారం పెట్టించారన్నారు. ముదిగుబ్బ మండలంలో 2017 నుంచి 2019 సంవత్సరం వరకు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి జరిగిన 13వ విడత సామాజిక తనిఖీలో రూ.3.68 కోట్ల అక్రమాలను తాము బయటపెట్టి 7 మంది అధికారులు, 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై కేసు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. అప్పట్లో హోల్డ్‌లో ఉన్న రూ.3.68 కోట్ల నిధులను తాజాగా విడుదల చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఈ డబ్బంతా అధికారులు, రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఈ అవినీతి కుంభకోణంతో సంబంధం లేకుంటే తక్షణం విచారణ జరిపించి సొమ్ము రికవరీ చేయాలన్నారు. కష్టపడి పని చేసిన ఉపాధి కూలీలకు 3 నెలలవుతున్నా ఇంత వరకు డబ్బు రాలేదని... దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలతో కలసి భోజనం చేయడం కాదని... వారికి సకాలంలో బిల్లులు మంజూరు చేసి న్యాయం చేయాలని మంత్రి సత్యకుమార్‌కు కేతిరెడ్డి చురకలంటించారు.
ముదిగుబ్బ రైతులకు న్యాయం చేయాలి
పరిటాల రవి హత్యానంతరం జరిగిన గొడవల్లో ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను తగులబెట్టారని, దీంతో రైతులు ఫ్రీహోల్డ్ విషయంలో రికార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని గుర్తించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముదిగుబ్బ రైతులందరికీ ఫ్రీహోల్డ్ వర్తించేలా అప్పట్లో చర్యలు తీసుకున్నారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా రైతుల భూములు మళ్లీ ఫ్రీహోల్డ్‌లోనే ఉన్నాయని.. వారికి న్యాయం చేయాలని కలెక్టర్‌కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డి వెంట ముదిగుబ్బ రైతులు, రైతు సంఘం నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.
ముదిగుబ్బ మండలంలో అవకతవకలు
ఉద్యానశాఖ అధికారుల కనుసన్నల్లో రూ.1.38 కోట్ల ప్రజాధనం స్వాహా
‘ఉపాధి హామీ’ పనులు చేయకుండానే రూ.కోట్లు పక్కదారి
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు
సోషల్ ఆడిట్ మేనేజ్
హోల్డ్‌లో పెట్టిన రూ.3.68 కోట్లకు బోగస్ బిల్లుల మంజూరు
అధికార పార్టీ నాయకుల అండతోనే యథేచ్ఛగా అవినీతి, అక్రమాలు
కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్


