కదిరి: కదిరి డివిజన్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాలాజీ అక్రమాస్తుల విలువ అక్షరాలా రూ.3.60 కోట్లు అని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(పీఆర్‌ఓ) పేరుతో విజయవాడ నుంచి ఏసీబీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తనకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు స్థానిక బీసీ హాస్టల్ వార్డెన్ లక్ష్మినారాయణ నుంచి లంచం తీసుకుంటూ బాలాజీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన అవినీతి, అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా రూ.కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. దీంతో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2), సెక్షన్ 13(1బీ)కింద ఆయనపై మరో కేసు (క్రైం నెం.05/ఆర్‌సీఏ–ఏటీపీ) నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.
ఏకకాలంలో సోదాలు
బాలాజీ అక్రమాస్తులపై సోమవారం కదిరితో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆస్తి పత్రాలతో పాటు నేరారోపణకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాలాజీకి 11 చోట్ల ఎంతో విలువైన ఇంటి స్థలాలు, రెండు భవనాలు, రూ.21.80 లక్షల నగదు, సుమారు రూ.26.50 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కియా కంపెనీకి చెందిన సెల్టోస్ కారు, మారుతి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.37.50 లక్షల బ్యాంకు నిల్వలు, రూ.13 లక్షలు విలువ చేసే ప్రాంసరి నోట్‌లతో పాటు విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ రూ.3.60 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే కదిరి వాణివీధిలో ఉంటున్న బీసీ హాస్టల్ వార్డెన్ జయరామిరెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. అయితే జయరామిరెడ్డి ఇంట్లో ఎలాంటి ఆధారాలూ దొరకలేదని సీఐ జయమ్మ విలేకరులకు తెలిపారు. అయితే మిగతా ప్రాంతాల్లో దొరికిన ఆస్తులన్నింటినీ బాలాజీ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో పాటు ఆయన తండ్రి పేరు మీద పెట్టినట్లు వారు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోనే ఎక్కువ భాగం ఆస్తులు ఉన్నాయి. తదుపరి సోదాలు ముగిసిన అనంతరం నిందితుడిని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారికంగా ప్రకటించిన ఏసీబీ
అన్నింటినీ స్వాధీనం చేసుకున్న వైనం
ఆయనపై మరో కేసు నమోదు


