బసవేశ్వరుని బోధనలు అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

బసవేశ్వరుని బోధనలు అనుసరణీయం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

జయంతి వేడుకల్లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

ప్రశాంతి నిలయం: కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బసవేశ్వరుని బోధనలు అనుసరణీయమని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అన్నారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ విజయసారథి తదితరులు బసవేశ్వరుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... 12వ శతాబ్దంలోనే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం బసవేశ్వరులు చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన బోధించిన ‘శ్రమే నీ ఆరాధన’ అనే సిద్దాంతం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, లింగాయత్‌ సమాజ ప్రతినిధులు రాజశేఖర్‌, వీరేష్‌బాబు, విజయ్‌కుమార్‌, జంగం గంగాధర స్వామి, మహదేవ, సదాశివప్ప, నటరాజ తదితరులు పాల్గొన్నారు.

టీచర్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలు సిద్ధం

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ తాత్కాలిక జాబితా సిద్ధం చేసినట్లు ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్‌) ఆధారంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలలలో పనిచేస్తున్న ఎస్జీటీలు, పాఠశాల సహాయకులు, హెచ్‌ఎంల సీనియార్టీ జాబితాలను (సబ్జెక్టు వారీగా, మీడియం వారీగా) సిద్ధం చేశామన్నారు. deoanantapur. blogspot. com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సీనియారిటీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23లోగా పనిదినాల్లో మాత్రమే డీఈఓ కార్యాలయంలో పేరు, హోదా, సీనియార్టీ జాబితాలో తప్పిదంపై ఆధారాలతో సహా అందజేయాలని సూచించారు. జత చేయాలని సూచించారు. జాబితాలో పేర్లు లేని ఉపాధ్యాయులు కచ్చితంగా వారి వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు ఈ సీనియార్టీ జాబితాలను పరిశీలించి తమ పరిధిలో ఉన్న టీచర్లు సస్పెన్షన్‌లో ఉన్నా, సెలవుపై ఉన్నా, ఏ ఇతర కారణాల వల్ల తాత్కాలిక జాబితాలో లేకపోతే వెంటనే కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. లేదంటే సంబంధిత ఎంఈఓలు, హెచ్‌ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఫారెన్‌ సర్వీస్‌లో పని చేస్తున్న టీచర్లు కూడా తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్నారో లేదో పరిశీలించుకోవాలన్నారు. గడువు తర్వాత వచ్యిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement