ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ విజయసారథి, ఎస్‌డీసీ శ్రీకర్‌ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 202 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీదారుల పేర్కొన్న సమస్యను పరిష్కరించే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పారదర్శకంగా విచారించి పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా గడువులోపు అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్‌ దరఖాస్తులు, రీ ఓపెనింగ్‌ అర్జీలు లేకుండా చూడాలన్నారు.

ఫర్టిగేషన్‌, ఆటోమేషన్‌తో రైతులకు మేలు

ఉద్యాన పంటల్లో ఫర్టిగేషన్‌, ఆటోమేషన్‌తో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ‘ఉద్యాన పంటల్లో కొత్త ఒరవడి– ఫర్టిగేషన్‌, ఆటోమేషన్‌’ అనే అంశంపై రూపొందించిన పోస్టర్లను జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ విజయసారథితో కలసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... బిందు సేద్యం ద్వారా నీటిని ఆటోమేషన్‌ పద్ధతిలో పంటకు అందించడంతో నీరు వృథా కాకుండా మొక్కల మొదళ్లకే చేరుతుందన్నారు. రసాయనిక ఎరువులను కూడా భూమిలో చల్లకుండా నీటిలో కరిగించి డ్రిప్‌ ద్వారా అందించే ఫెర్టిగేషన్‌ పద్ధతి పాటించాలన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ నీరు, పెట్టుబడితో లాభసాటి పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్‌, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement