పుట్టపర్తి అర్బన్: అంగన్‌వాడీ విద్యను పూర్తి చేసి ప్రాథమిక పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల స్నాతకోత్సవం సోమవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొని చిన్నారులకు స్నాతకోత్సవ ధ్రువీకరణ పత్రాలు, స్కూల్ బ్యాగ్‌లు, చాక్లెట్లు అందజేశారు. నల్లని గౌన్‌లు, టోపీలు ధరించిన చిన్నారులు కలెక్టరేట్‌లో సందడి చేశారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలే పునాది అని, ప్రతి చిన్నారిని తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, ఎస్‌డీసీ శ్రీకర్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఈఓ కిష్టప్ప, సీడీపీఓ జయంతి, సూపర్‌వైజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు బలి
● మార్కెట్ యార్డులో రివర్స్‌లో వచ్చి పడుకున్న రైతు మీద దూసుకెళ్లిన కారు
● నిద్రలోనే కన్నుమూత
రాప్తాడు రూరల్/కుందుర్పి: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ రైతు నిండు ప్రాణం బలైంది. పండించిన పంటను అమ్ముకుని కుటుంబానికి ఆధారం కావాలనే ఆశతో వచ్చిన అన్నదాత అదే మార్కెట్ యార్డులో ప్రాణాలు కోల్పోవడం చూపరులను కలచివేసింది. వివరాలు..కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రన్న (66) తన పొలంలో పండించిన మామిడి కాయలను బొలెరో వాహనంలో తీసుకుని కక్కలపల్లి గ్రామంలోని టమాట మండీకి వచ్చాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మార్కెట్‌లో సరుకు ఉంచి, మరుసటి రోజు ఉదయం వేలంలో పాల్గొనేందుకు అక్కడే వేచి ఉంటూ బహిరంగ ప్రదేశంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో టీఎస్ 07 ఈయూ 3699 నంబరు గల చావర్లెట్ క్రూజ్ కారును డ్రైవర్ రివర్స్ చేస్తూ నిద్రిస్తున్న చంద్రన్నను గుర్తించకుండా అతని మీదుగా దూసుకెళ్లాడు. ఘటనలో చంద్రన్న తొడలు, నడుం భాగం తీవ్రంగా నలిగిపోయాయి. క్షతగాత్రుడిని ఆగమేగాలపై స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పీఎస్ ఎస్‌ఐ రాంబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
అనుమానంతోనే
బాలుడి హత్య
● 48 గంటల్లోనే మిస్టరీ ఛేదింపు
● నిందితుడి అరెస్ట్
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పామురాయి సమీపంలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసులో మిస్టరీని 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. అనుమానం పెనుభూతమై ఓ బాలుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చాకలి రామ్మోహన్ సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను రూరల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎన్.శేఖర్ వెల్లడించారు. ఈ నెల 18న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పామురాయి సమీపంలోని సిమెంట్ పెల్లల ఫ్యాక్టరీ వద్ద స్థానిక రజక కాలనీకి చెందిన కళ్యాణ్ సాత్విక్ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు బాలుడు తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో కక్ష పెంచుకున్న రామ్మోహన్ పథకం ప్రకారం జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశానికి బాలుడిని తీసుకెళ్లి సిమెంట్ పెల్లలతో తలపై మోది హత్య చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐ ఎన్.శేఖర్ నేతృత్వంలోని పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారంరాప్తాడు మండలం కదిరి–అనంతపురం రోడ్డులోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐతో పాటు ఎస్‌ఐ కె. రాంబాబు, మహిళా ఎస్‌ఐ కె. చైతన్య స్వరూపిణి, పీసీలు తిమ్మప్ప, జయరాం నాయక్, కె. రాజును అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అభినందించారు.


