తనకల్లు: ‘సీఎం సారూ... ఆక్రమణకు గురైన మా పాఠశాలను కాపాడండి’ అంటూ మొగలిచెట్లతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు నినదించారు. సోమవారం ఉదయం పాఠశాల ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... మొగలిచెట్లతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన కొంత స్థలాన్ని స్థానికుడు శ్రీరాములు నాయక్, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించి ఇటీవల షెడ్డు నిర్మించారు. దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంగా సోమవారం ఉదయం పాఠశాల వద్ద విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాన్ని తొలగించి, ప్రహరీ నిర్మించాలంటూ నినదించారు. అలాగే అక్రమ కట్టడాన్ని తక్షణమే తొలగించి, పాఠశాల స్థలాన్ని కాపాడలంటూ మొగలిచెట్లతండాకు చెందిన పలువురు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. శ్రీరాములునాయక్ ఆక్రమించుకున్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కొన్ని నెలలుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూడు నెలల క్రితం కలెక్టర్, రెవెన్యూ, విద్యాశాఖ, మండల పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలను నిర్ధారించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే అక్రమ కట్టడాన్ని తొలగించి, పాఠశాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేయాలంటూ నోటీసు జారీ చేసినా నేటికీ ఫలితం దక్కలేదన్నారు. ఇప్పటికై నా పాఠశాల ఆక్రమిత స్థలాన్ని కాపాడాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
పాఠశాల ఎదుట ప్లకార్డులతో విద్యార్థుల నిరసన
తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ఆందోళన


