రామగిరిలో రేపు రెవెన్యూ క్లినిక్‌ | - | Sakshi
Sakshi News home page

రామగిరిలో రేపు రెవెన్యూ క్లినిక్‌

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

ప్రశాంతినిలయం: ఈ నెల 22న రామగిరిలో రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. ఈ అంశంపై జిల్లా అధికారులతో సోమవారం వీసీలో కలెక్టర్‌ సమీక్షించారు. గడువు దాటిన ఫిర్యాదులు ముదిగుబ్బ, కదిరి, కనగానపల్లి మండలాల్లో అధికంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల్లో పర్యటించి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం జేసీ ఆద్వర్యంలో పురోగతిని సమీక్షించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ రికార్డుల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 22ఏ జాబితా సవరణలోని 187 దరఖాస్తులను క్లియర్‌ చేయాలన్నారు. సెల్ప్‌ ఎన్యుమరేషన్‌ 4.82 శాతం మాత్రం అయిందని, ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్‌, సర్వే ఏడీ విజయశాంతి తదితరులు ఉన్నారు

‘మన ఊరు–మన నీరు’ వెబ్‌సైట్‌ ప్రారంభం

నీటి సంరక్షణకు సాంకేతిక తోడ్పాటునందించేలా రూపొందించిన ‘మన ఊరు– మన నీరు’ వెబ్‌సైట్‌ను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ప్రారంభించారు. భూగర్భ జలాల పునరుద్దరణ, నీటి వనరుల సమర్థవంతమైన నిర్వహణ లక్ష్యంగా వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో 467 పంచాయతీల్లో నీటి సంరక్షణ పనులను సిటిజన్‌ పోర్టల్‌ ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. వర్షపాతం, భూగర్భ జల మట్టం, చెరువుల నిల్వ సామర్థ్యం, నదుల ప్రవాహానికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. వాన నీటిని వృథాగా పోనీయకుండా ఇంకుడు గుంతలు, చెక్‌ డ్యాంల నిర్మాణ పనులను ట్రాక్‌ చేయడం జరుగుతుందన్నారు. చిత్రావతి, జయమంగళి వంటి 8 నదుల సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ చక్రపాణి, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్‌, నీటిపారుదల ఈఈ గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. .

‘మన రైతన్న–మన బలం’ ఛానల్‌ ప్రారంభం

రైతుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ‘మన రైతన్న – మన బలం’ యూట్యూబ్‌ ఛానల్‌ను కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ శుక్రవారం ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్‌, జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పంటల సాగులో రైతులు సాధించిన విజయాలు, అనుసరిస్తున్న మెరుగైన పద్ధతులను ఈ ఛానల్‌ ద్వారా వీడియోల రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం, ఆధునిక పద్ధతులు, సాంకేతిక సలహాలు, సందేహాలను ఫీడ్‌బ్యాక్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement