బొమ్మనహాళ్: మండల కేంద్రంలో వెలసిన వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం 6 గంటలకు దీక్షా హోమం, బలిహరణ, 10 గంటలకు రథాంగహోమం, రథ బలి, మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మ రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం ముందు వివిధ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, భక్తులు కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.


