న్యూస్‌రీల్
ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
బంగారు గొలుసు అపహరణ
బత్తలపల్లి: శుభకార్యానికి వెళ్తూ బ్యాగులో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదని బాధితులు నాగమోహన్, భూమిక దంపతులు ఆవేదన చెందారు. వివరాలు.. ముద్దనపల్లికి చెందిన నాగమోహన్, భూమిక దంపతులు నార్పల మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బత్తలపల్లికి వచ్చారు. తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత బ్యాగులో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్ కనిపించలేదు. అయితే అదే బ్యాగులో జత కమ్మలు, చిన్నపాటి గొలుసు ఉందని బాధితులు తెలిపారు. అనంతరం బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.


