గోల్డ్‌షాపులో అమ్మకానికి ఉంచిన బంగారు నగలు
కిటకిటలాడుతున్న బంగారు దుకాణం
బంగారు షాపులో నగలు కొనుగోలులో బిజీగా ఉన్న మహిళ
హిందూపురం: హిందూ సంప్రదాయాల్లో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది.. అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇదొకటి.వైశాఖ మాసం శుక్లపక్షం మూడో చంద్రరోజు తృతీయ నాడు వస్తుంది. అక్షయ అనే పదానికి శాశ్వతం.. ఎప్పటికీ తగ్గనిది అని అర్థం. ఇది అంతులేని శ్రేయస్సు, అదృష్టం, విజయాన్ని ఇస్తుందని ప్రజల నమ్మకం. అక్షయ తృతీయ.. విష్ణుమూర్తితోపాటు లక్ష్మీదేవిని ఆరాధించే ఈ పర్వదినాన ఏప్రిల్ 20 కొత్త వస్తువులు కొనుగోలుతోపాటు శుభకార్యాలా, కొత్త పనులకు శ్రీకారం చుడితే మంచిదని ఓ నమ్మకం. అక్షయ తృతీయ రోజున కలిగే యోగాలప్రభావం వల్ల చేసే పనులకు మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం.
అక్షయ తృతీయను ఆంధ్రప్రదేశ్ కన్నా ఉత్తరాది రాష్ట్రాలో విశేష పండుగగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి తదితర పట్టణాల్లో బంగారు, వెండి కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. హిందూపురంలోని గాంధీసర్కిల్, మెయిన్‌బజారు, కంసాలపేట, చిన్నమార్కెట్ ఏరియాలో పండుగ వాతావరణం నెలకొంది. బంగారు దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించి పలు రకాల డిస్కౌంట్ల రేట్లు ప్రదర్శనలో ఉంచారు. అక్షయ తృతీయ దినాన ఆవగింజంత బంగారమైనా కొనాలని ప్రచారంతో ప్రజలు ప్రత్యేకించి, మహిళలు బంగారు దుకాణాల్లో రద్దీగా కనిపిస్తున్నారు. కుమారైలు, కొత్త కొడళ్ల బంగారు ఆభరణాలను కొనిడానికి కుటుంబ సభ్యులు ఆసక్తి చూపసాగారు. ఈపండుగను హిందూవులు మాత్రమే కాకుండా ముస్లిం మహిళలు కూడా తరలివచ్చి బంగారు నగలు కొనుగోలు చేయడం విశేషం. కుబేరుడు ఈ తిథిలో ధనాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన రోజుగాను, శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయపాత్ర ప్రసాదించిన రోజుగాను ఇలా.. పలు రకాలుగా పురాణ కథలు చెప్తున్నాయి. అక్షయ అంటే క్షయం కానిది ఎన్నాడూ తరిగిపోనిందని అర్థం. లక్ష్మిదేవికి ప్రీతికరమైన బంగారు ఆభరణాలతో పూజిస్తే లక్ష్మిదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని ప్రజల విశ్వాసం.
బంగారు దుకాణాల్లో కొనుగోళ్ల సందడి
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే స్వర్ణశోభితమే..
అంతా కలిసొస్తుందని నమ్మకం..
అక్షయ తృతీయరోజున బంగారు, వెండి కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని ప్రచారం. దీంతో చాలామంది మహిళలు నగలు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆదివారం, సోమవారం రెండురోజులు ఇలాగే సందడిగా ఉంటుంది. నగలు కొనడమంటే మహిళలకు బాగా ఇష్టం. ఇంట్లో వారు కూడా సెంటిమెంట్‌ను కాదనలేరు.
– నంబూరి శంకర్, జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షులు,హిందూపురం
ఉంగారం కొన్నాం..
అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని అంటారు. అందుకు బంగారుం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నేను కూడా కమ్మలు, వెండి పట్టీలు కొన్నాం. బంగారం కొనడం వల్ల నష్టమేమీ ఉండదు అని అందూ కొంటున్నారు.
– గంగమ్మ, హిందూపురం


