రొద్దం:గౌరాజుపల్లి గ్రామ సమీపంలోని ఎం. కొత్తపల్లి – నారనాగేపల్లి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం బోల్తాపడి గాయపడిన ప్రకాష్ (15) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. వివరాలు.. నారనాగేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూపూరు గోవిందప్ప కొడుకు ప్రకాశ్.. పదోతరగతి పరీక్షలు రాశాడు. శనివారం రొద్దం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి, తీవ్రంగా గాయపడ్డాడు. ప్రకాష్‌ను పెనుకొండ ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ సర్పంచు నాగార్జున ఆవుల లక్ష్మీనారాయణరెడ్డి, కురుబ నాగరాజు, ఓబిరెడ్డి, గొల్ల సత్యనారాయణ, బాబు తదితరులు బాధిత కుటుంబానికి రూ.20వేలు ఆర్థికసాయం అందించారు.
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
బత్తలపల్లి: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆదివారం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. జలాలపురానికి చెందిన బి.శివయ్య, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు నెల్లూరులో బీటెక్ చదువుతున్నాడు. రెండో కొడుకు జగదీష్ ధర్మవరంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. ఈనెల 17న రాతిర భోజన సమయంలో తల్లిదండ్రులు కుమారుడితో మాట్లాడుతూ వచ్చే సంవత్సరమైనా బాగా చదివి మంచి ఫలితాలు తెచ్చుకోవాలని సూచించారు. మనస్థాపంతో మరుసటిరోజు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి చేరుకోగా, ఇంటి వద్ద ఉన్న కుమారుడు కనిపించలేదు. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ మృతి
హిందూపురం: సోమందేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అమీరా (50) ఆదివారం మృతిచెందింది. సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ తెలిపిన మేరకు.. హిందూపురంలోని హస్నాబాద్‌కు చెందిన డ్రైవర్ ఇక్బాల్, కుటుంబ సభ్యులు కారులో గోరంట్లకు శుభకార్యానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా మార్గంమధ్యలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును తగిలి, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనింది.ఈప్రమాదంలో కారు వెనుక భాగంలో కూర్చున్న అమీరాకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బయన్నపేటలో
యువకుడిపై దాడి
బుక్కరాయసముద్రం:దయ్యాలకుంటపల్లి వద్దనున్న బయన్నపేటలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమార్తె వివాహం త్వరలో జరగబోతుండగా, ఇల్లు శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. రామాంజనేయులు కొడుకు గణేష్ స్థానికంగా ఉన్న కొళాయి వద్ద నీరు పట్టుకుంటుండగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, సూరి అక్కడ ఘర్షణ పడ్డారు. గణేష్‌పై శ్రీకాంత్, సూరి కర్రలతో భౌతికదాడికి దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
పుట్లూరు: రంగమనాయునిపల్లిలో శనివారం రాత్రి వీరేంద్ర (26) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వీరేంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. కూలి పనులకు వెళ్లి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగుతున్న విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో గ్రామంలోని తన మేనమామ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువులు వెంటనే తలిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు తండ్రి ఓబులేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళా వికాసానికి
కాంగ్రెస్ అడ్డు
అనంతపురం టవర్‌క్లాక్: మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్‌తో సహా విపక్షాలు వ్యతిరేకించి మహిళా వికాసానికి అడ్డుపుల్ల వేశాయని.. అయినా చర్చలు జరిపి గెలిచే తీరుతామని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు పోరాడతామన్నారు.


