ప్రశాంతినిలయం: వేసవి ఎండలు మండుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగుతీసి అడుగు వేయాలన్నా జంకుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాంతకమని కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజబేగం చెబుతున్నారు. వేసవి కాలంలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బ తగిలే సూచనలున్నాయి. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రాకూడదని, వెళ్లాల్సి వస్తే రక్షణగా గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లకుండా ఉండడమే మంచిది. సుమారు నెల రోజుల నుంచి రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా సన్‌స్ట్రోక్ (వడదెబ్బ) తగిలితే మనిషికి చెమట పట్టక పోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర/కలవరింతలు ఉండడం, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి లోకి వెళ్తారు.
వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..
● నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
● లేత వర్ణం, తేలికై న, కాటన్ దుస్తులు ధరించాలి.
● ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి.
● పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. శుభ్రంగా రెండు పూటలా స్నానం చేయాలి.
● భోజనం మితంగా తిని నీరు అధికంగా తాగాలి.
● ఎండ అధికంగా ఉన్న సమయంలో ఇంటి పట్టునే ఉండాలి. బయటకు వెల్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలి.
● ఇంట్లో ఉన్న సమయంలో కిటికీలు తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి.
చేయకూడని పనులు:
● మండుటెండలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు.
● సూర్యకిరణాలు, వేడి గాలికి గురి కాకూడదు.
● ఎండ అనిపిస్తే రోడ్డు పక్కన ఉన్న చల్లని, రంగు పానీయాలు తాగరాదు.
● రోడ్ల మీద విక్రయించే కలుషిత ఆహారం తిపకూడదు.
● వేసవిలో మాంసాహారం తగ్గించాలి. మద్యం తాగరాదు.
● ఎండ వేళల్లో శరీరంపై భారం ఉండే విధంగా పనులు చేయరాదు.
● నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు.
వడదెబ్బకు ప్రథమ చికిత్స:
● వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.
● చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా చేయాలి.
● ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలే విధంగా ఉంచాలి.
●ఉప్పు కలిపిన మజ్జిగ/ చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ /ఓరల్ డీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్‌ఎస్) తాగించొచ్చు.
వడగాలులు ప్రాణాంతకం
రోజుకు 15 గ్లాసుల నీరు తాగాలి
వడదెబ్బ ప్రాణాంతకమైనది
వడదెబ్బకు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతకమే.. ముఖ్యంగా ఉపాధి పనులకు వెళ్లే కూలీలు సాధ్యమైనంతగా మంచినీళ్లు తీసుకెళ్లి అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఉదయం పనులు ప్రారంభించి, 10 గంటల్లోపు పూర్తి చేసి, ఇంటికి చేరుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల లోపు శ్రమతో కూడిన పనులను చేయరాదు. ఇక గర్భిణులు పూర్తిగా బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి. వెళ్లాల్సి వస్తే ఆటోలు, జీపులు బస్సుల్లో వెళ్లి పనులు చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేయాలి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ శీతల పానీయాలు పూర్తిగా మానేయాలి. అధిక ప్రోటీన్ ఉండే ఉప్పు, కారం, నూనె పదార్థాలు తీసుకోవద్దు. చిన్న పిల్లలను బయటకు పంపరాదు. స్కూళ్లు వదిలిన తర్వాత విద్యార్థుల సంరక్షణ చాలా ముఖ్యం. బయట ఆడే ఆటల కంటే ఇంట్లోనే ఆడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
– శ్యాం ప్రసాద్, కలెక్టర్, శ్రీసత్యసాయి జిల్లా:


