సాక్షి, పుట్టపర్తి
ఎండలు మండిపోతున్నాయి. వ్యవసాయ పనులు కూడా లేవు. అయినా సరే కూలీలు వీబీజీ రామ్‌జీ పథకంలో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు చేసినా ఫలితం లేదని భావిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఫేస్ యాప్ అటెండెన్స్ ఉండటంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. అందువల్లే రోజు వారి కూలీల లక్ష్యంలో నాల్గో వంతు కూడా హాజరు కావడం లేదు. దీంతో కూలీల సంఖ్య పెంచేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్‌లపై ఒత్తిళ్లు తెస్తున్నారు. లక్ష్యం చేరుకోకపోతే వేటు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి పనులకు కూలీలను తీసుకెళ్లేందుకు పల్లెల్లో బతిమాలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
25 మంది సస్పెండ్..
వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జిల్లాలకు లక్ష్యం విధిస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టర్ శ్యాంప్రసాద్ వీబీజీ రామ్‌జీ పథకం సిబ్బందితో సమావేశాలు నిర్వహించి కూలీల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. ఎలాగైనా లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించాలని ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజురోజుకూ పనులకు వచ్చే కూలీలు తగ్గిపోవడంతో కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కూలీల సంఖ్య పెంచని 25 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఆరుగురు ఏపీడీలకు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో మిగతా వారందరూ అప్రమత్తమయ్యారు. అయితే ఉపాధి బిల్లులు ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా ఉండగా..పనులకు వెళ్తే.. కూలి డబ్బులు ఎప్పుడు ఇస్తారోనని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది చేసిన పనులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగింట ఒకవంతు హాజరు..
జిల్లాలో 3.50 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వారిలో రోజుకు 1.20 లక్షల మంది హాజరు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం కూలీల సంఖ్య రోజుకు సగటున 40 వేలు కూడా దాటడం లేదు. రోజూ 30 వేల నుంచి 35 వేల మధ్యన కూలీల సంఖ్య ఉంటోంది. దీంతో ఉపాధి పనులపై దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్‌లపై ఒత్తిడి పెంచారు. అయితే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతోనే కూలీలు పనులకు రావడం లేదనే కారణం చెబుతున్నారు. పనిచేసి నెలల తరబడి వేచి చూడాలా...అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు.
‘‘బాబ్బాబు.. ఉపాధి పనులకు రండి..
రోజుకు రూ.300పైనే కూలి ఇస్తాం. పనిచేసే ప్రాంతంలో నీడ, నీరు కల్పిస్తాం. ఇప్పుడు వేసవి అలవెన్సులు కూడా ఇస్తున్నాం’’ అంటూ అధికారులు ఉపాధి కూలీలను బతిమాలుతున్నా...పనులకు రాలేమని కూలీలు తెగేసి చెబుతున్నారు. ముందు చేసిన పనులకు బిల్లులివ్వండి..
ఆ తర్వాత ఆలోచిస్తామంటున్నారు.
కలెక్టర్ మాత్రం కూలీల సంఖ్య పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తుండగా
అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
రూ.30 కోట్లపైనే వేతన బకాయిలు
పనులు చేసేందుకు
ఆసక్తి చూపని కూలీలు
లక్ష్యం పూర్తి చేయాలని
అధికారుల నుంచి ఒత్తిళ్లు
కూలీలను తీసుకురాలేదని
ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
25 మంది ఎఫ్‌ఏలను
సస్పెండ్ చేసిన కలెక్టర్
మరో ఆరుగురు ఏపీడీలకు నోటీసులు


