రాప్తాడు రూరల్: అనంతపురం నగరం, రూరల్‌లో సమాజాన్ని కుదిపేస్తున్న సంచలన హనీ ట్రాప్ (వలపు వల) ముఠా దందా వెలుగులోకి వచ్చింది. బయటకు గౌరవంగా జీవిస్తున్న అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, వలపు వయ్యారాలతో వల వేసి రూ.లక్షల్లో దోచుకుంటున్న తీరు భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ముఠాకు ఒక మహిళే సూత్రధారి. కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తుంది. ఆ తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్‌లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత మాటల మాయలో పడేసిన తర్వాత సదరు వ్యక్తిని ఒక ఇంటికి పిలుస్తారు. అక్కడ మహిళతో ఏకాంతంగా గడిపే వాతావరణం కల్పిస్తారు. ఆ తర్వాత ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని నగ్నంగా ఉండేలా చేస్తారు. ఆ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అనంతరం ‘భర్త’, ‘తమ్ముడు’, ‘అక్క’, ‘బావ’, ‘చెల్లెలు’, ‘పక్కింటి వాళ్లు’ పాత్రల్లో ముఠా సభ్యులు ఒక్కసారిగా దూసుకొచ్చి గొడవ సృష్టిస్తారు. ‘నా భార్యతో ఏం చేస్తున్నావ్?’ అంటూ భర్త పాత్రధారుడు దాడికి దిగుతాడు. ‘మా చెల్లెలు జీవితం నాశనం చేశావంటూ’ అన్నపాత్రధారుడు, ‘మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావంటూ’ పక్కింటిపాత్రధారులు నటిస్తారు. ఈ పరిణామంతో బాధితులు బెంబేలెత్తిపోతారు. తీవ్ర భయాందోళనకు గురవుతారు. పాత్రధారుల్లో అనంతపురం రూరల్, అర్బన్ వాసులతో పాటు రాప్తాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు.
బ్లాక్‌మెయిల్ దందా..
‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బాధితులను బెదిరిస్తారు. బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. కొందరితో బాండ్లు రాయించుకుని, గడువులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలామంది బయటకు రాకుండా రూ.లక్షలు చెల్లించినట్లు సమాచారం. అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి వీరి వలలో చిక్కుకుని రూ.25 లక్షల దాకా చెల్లించాడు. చివరకు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోవారికి చెప్పుకోలేక ఆత్మహత్మకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద మూడు తులాల బంగారు, రూ.8 లక్షల నగదు తీసుకున్నారు. ఓ వీఆర్‌ఓ వద్ద రూ.7 లక్షలు తీసుకుని రూ.లక్షకు బాండు రాయించుకున్నారు. పాపంపేట ప్రాంతానికి చెందిన ఓ ఫిజియోథెరపిస్టు నుంచి రూ.10 లక్షలు, పాతూరులోని ఓ కిరాణా కొట్టు నిర్వాహకుడి వద్ద రూ.14 లక్షలు, జాతీయరహదారిలో ఉన్న పేరు మోసిన ఓ హోటల్ నిర్వాహకుడు రూ.25 లక్షలు, గార్లదిన్నెకు చెందిన ఓ వ్యక్తితోనూ రూ.లక్షలు వసూళ్లు చేశారు. ఇవన్నీ ఎస్పీకి అందజేసిన ఫిర్యాదులో పొందుపరిచారు. కాగా గార్లదిన్నె మండలానికి చెందిన ఓ బాధితుడు కూడా శనివారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ దందాకు కొందరు పోలీసులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపించడం... ఏ పోలీసు ఎప్పుడొచ్చాడు, ఎంత డబ్బు తీసుకెళ్లాడో ముఠా సభ్యులు మాట్లాడుకున్న రికార్డులు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇందులో పోలీసులతో చేసిన సంభాషణలు కూడా ఉండడం గమనార్హం.
అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ పురోహితుడికి ఓ మహిళ ఫోన్ చేసి వాస్తుచూసి పరిహార పూజలు చేయాలని కోరింది. పది రోజుల తర్వాత పురోహితుడిని ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లగానే...‘ఉండండి స్వామి.. నా భర్త పూజ సామగ్రి తెస్తున్నాడ’ని చెప్పి అతన్ని సమ్మోహితున్ని చేసింది. ఇంతలో ఓ వ్యక్తి, మహిళ ఇంట్లోకి వచ్చీరాగానే తలుపు గడియపెట్టి పురోహితుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. బెడ్రూంలో ఉన్న మహిళను కూడా బయటకు పిలిపించి ఇద్దరి దుస్తులనూ తొలగించి, వీడియోలు, ఫొటోలు తీశారు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో.. రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. పురోహితుడి ఇంట్లోని బంగారం బ్యాంకులో పెట్టించి రూ.5 లక్షలు తీసుకున్నారు. తక్కిన రూ.5 లక్షలను కొద్దిరోజులకు బ్యాంకులో పెట్టిన బంగారుపై అదనంగా ఇప్పించుకున్నారు. ఐదురోజుల కిందట ముఠా సభ్యులు ఇంటికి పిలిపించి మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయగా..బాధితుడు మూడు రోజుల కిందట ఎస్పీ జగదీష్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హనీ ట్రాప్ ముఠా వ్యవహారంపై కూపీ లాగుతున్నారు.
అనంతపురంలో నయా ‘హనీ ట్రాప్’
రూ.5 లక్షల నుంచి రూ. 25 లక్షల దాకా వసూలు
బాధితుల్లో పురోహితుడు, వీఆర్‌ఓ, ఫిజియోథెరపిస్టు, ఆర్‌ఎంపీ, రియల్టర్లు
ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు


