● కలెక్టర్ శ్యాంప్రసాద్
● పట్టుచీర డిజైనర్ నాగరాజుకు
అభినందన
ధర్మవరం: జిల్లాలోని చేనేతలు తమ నైపుణ్యం ఉపయోగించి తయారు చేసే ధర్మవరం పట్టుచీరలతో జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతోందని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. శనివారం ధర్మవరం వచ్చిన కలెక్టర్ జాతీయ అవార్డు గ్రహీత, పట్టుచీరల డిజైనర్ జుజారు నాగరాజును సన్మానించారు. చైనా దేశంలోని బీజింగ్, గ్యాంగ్జూ నగరాల్లో జరిగిన ‘వసంత మేళా–2026’ పాల్గొన్న జుజారు నాగరాజు మన నాగరికతను ప్రదర్శించి అంతర్జాతీయంగా చేనేత విభాగంలో జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చారని కొనియాడారు. మరుగున పడుతున్న చేనేత పరిశ్రమకు నాగరాజులాంటి కళాకారులెందరో ప్రాణం పోస్తున్నారన్నారు. అనంతరం కంప్యూటర్‌లో డిజైనింగ్ చేసే విధానం, డిజైన్ గ్రాఫ్, ప్రింటింగ్, పట్టుచీరలు, పట్టు శాలువా తయారీపై డిజైనర్ నాగరాజు కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు వివరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, తహసీల్దార్ సురేష్‌బాబు, నాయకులు తదితరులు ఉన్నారు.
చిరుత కూన
అనుమానాస్పద మృతి
● నీరు దొరక్క చనిపోయి ఉండొచ్చన్న అధికారులు
రొళ్ల: నాలుగైదు నెలలు వయసు గల ఓ చిరుత కూన అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం రొళ్ల మండలం హొట్టేబెట్ట పంచాయతీ కల్లురొప్పం గ్రామ సమీపాన మందలపల్లి బీట్ అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. అటుగా వెళ్లిన పశువుల కాపరులు చిరుత కూన కళేబరాన్ని గుర్తించారు. వారి నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎఫ్‌ఓ చక్రపాణి, పశు సంవర్ధక శాఖ మడకశిర ఏడీ అమర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత చిరుత పిల్ల కళేబరాన్ని అక్కడే దహనం చేశారు. అటవీ ప్రాంతంలో నీళ్లు దొరక్క.. ఎండ తీవ్రతకు మృతి చెంది ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామని, నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.
రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో
జిల్లా జట్టు సత్తా
ధర్మవరం అర్బన్: 16వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా జట్టు సత్తా చాటింది. ఫైనల్స్‌లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ తెలిపారు. చిత్తూరులో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి హాకీ పోటీలు జరిగాయన్నారు. శనివారం అనంతపురం జిల్లా జట్టుతో జరిగిన ఫైనల్స్‌లో 2–1తో ఓటమి చెంది రెండో స్థానంతో నిలిచిందన్నారు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును జిల్లాకు చెందిన క్రీడాకారిణి వర్ష అందుకుందని తెలిపారు. సత్తా చాటిన క్రీడాకారులను జిల్లా హాకీ అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, ఉడుముల రామచంద్ర, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, అంజన్న, అరవింద్‌గౌడ్, చందు, హాకీ జిల్లా కోచ్ హుసేన్, డైరెక్టర్లు మారుతికుమార్, ఇర్షాద్, అమునుద్దీన్, కిరణ్ తదితరులు అభినందించారు.


