పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

పుట్టపర్తి టౌన్‌: ‘‘నేరాలను పూర్తిగా నియంత్రించాలి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలి. అప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. ఇందుకోసం ప్రతి పోలీసు అధికారి నిబద్ధతతో పని చేయాలి. విధుల్లో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఉపేక్షించేది లేదు’’ అని ఎస్పీ సతీష్‌కుమార్‌ తేల్చి చెప్పారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో వివిధ సబ్‌ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చోరీలు, గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, రోడ్డు ప్రమాదాల కేసులపై చర్చించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు క్యాష్‌ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమాజానికి హానికరంగా మారిన వ్యక్తులపై పీడీ యాక్ట్‌ అమలు చేయాలన్నారు. చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లపై మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చాలా కాలంగా పెండింగ్‌ ఉన్న వివిధ కేసుల్లో త్వరితగతిన పురోగతి సాధించాలన్నారు. చోరీల నియంత్రణలో మరింత కఠినంగా వ్యవహరిస్తూ ప్రాపర్టీ కేసుల్లో రికవరీ పెంచాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ల్లో చోరీల నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలపై అందరికీ అవగాహన కల్పించి దేవాలయాలు, ఇళ్లలో ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. నేర నియంత్రణకు గట్టిగా కృషిచేస్తే పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. డీఎస్పీలు ప్రతివారం సమీక్షలు నిర్వహించి కేసుల దర్యాప్తుపై సిబ్బందికి దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు మహేష్‌, నర్సింగప్ప, శివనారాయణస్వామి, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, డీటీఆర్‌బీ సీఐ నరేంద్రరెడ్డి, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్‌ రెడ్డి, సీఐ ఇస్మాయిల్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నేర నియంత్రణకు

ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సమీక్షలో ఎస్పీ సతీష్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement